మన నిత్య జీవితంలో ప్రస్తుతం ఆధార్ అనేది ఒక భాగం అయింది. ఆధార్ లేకుండా దాదాపుగా మనం ఏ పనీ పూర్తి చేయలేం. అనేక సేవలను పొందేందుకు ఆధార్ కచ్చితంగా అవసరం అవుతోంది. అయితే ఆధార్ కార్డులను చాలా మంది సాధారణ కార్డు రూపంలో కలిగి ఉన్నారు. అది త్వరగా దెబ్బ తినేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఆధార్‌ను పీవీసీ కార్డు రూపంలో భద్ర పరుచుకుంటే ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. ఈ క్రమంలోనే కేవలం రూ.50 చెల్లించడం ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా ఆధార్ పీవీసీ కార్డును పొందవచ్చు. దాన్ని ఆన్‌లైన్ లో ఆర్డర్ చేస్తే ఆ కార్డు పోస్టు ద్వారా నేరుగా మీ ఇంటికే వస్తుంది. మరి అందుకు ఏం చేయాలంటే…
1. UIDAI అధికారిక వెబ్‌సైట్ uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html ను సందర్శించాలి.
2. అక్కడ Order Aadhaar PVC Card అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
3. తరువాత ఇచ్చే ఆప్షన్‌లలో ముందుగా 12 అంకెల ఆధార్ నంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడీ/28 డిజిట్ల ఈఐడీలలో దేన్నయినా ఎంటర్ చేయాలి.
4. అక్కడే కనిపించే సెక్యూరిటీ కోడ్‌ను బాక్స్‌లో ఎంటర్ చేయాలి.
5. తరువాత మీ మొబైల్ నంబర్ ఆధార్‌కు లింక్ అయి లేకపోతే అక్కడ నాన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయవచ్చు. అందుకు అక్కడ ఉండే టిక్ మార్క్‌ను సెలెక్ట్ చేయాలి.
6. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంటే Send OTP అనే బటన్‌పై క్లిక్ చేయాలి. ఓటీపీ వస్తుంది.
7. ఓటీపీ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి.
8. ఒక్కసారి వివరాలను చెక్ చేసుకోమని అడుగుతుంది. అనంతరం పేమెంట్ చేయాలి. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్ చేయవచ్చు.
9. పేమెంట్ విజయవంతం అయ్యాక పేమెంట్ చేసినట్లు ఇచ్చే స్లిప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇక కార్డు స్పీడ్ పోస్టు ద్వారా డెలివరీ అవుతుంది.
ఆధార్ పీవీసీ కార్డును సులభంగా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు. పీవీసీతో తయారు చేస్తారు కనుక కార్డు మన్నికగా ఉంటుంది. ఎక్కువ రోజులు ఉన్నా కార్డు చెక్కు చెదరదు. మీరు నిత్యం దగ్గర ఉంచుకునే ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల్లా దీన్ని కూడా పర్సు లేదా వాలెట్‌లో పెట్టుకోవచ్చు.