దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ముంబై, మహారాష్ట్ర ప్రాంతాలలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడిన సంగతి మనకు తెలిసిందే. సచిన్ కి మార్చి 27వ తేదీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా కేవలం స్వల్ప లక్షణాలు ఉండటంతో హోమ్ ఐసోలేషన్ కి వెళ్లారు. ఈ క్రమంలోనే సచిన్ కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్ అని నిర్ధారణ అయింది. సచిన్ కరోనా బారిన పడిన ఆరు రోజుల తర్వాత డాక్టర్ల సలహా మేరకు ఇవాళ ఆస్పత్రిలో చేరారు.
సచిన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు స్వయంగా సచిన్ టెండూల్కర్ ఈ విషయాన్ని వెల్లడించారు. “వైద్యుల సలహా మేరకే ఆస్పత్రిలో చేరాను. తొందరలోనే కోలుకుని తిరిగి వస్తాను. నా కోసం ప్రార్థించిన మీ అందరికీ కృతజ్ఞతలు. 2011 ప్రపంచ కప్ పదవ వార్షికోత్సవ సందర్భంగా తోటి క్రికెటర్లకు, భారతీయులందరికీ శుభాకాంక్షలు” అని సచిన్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.
ప్రస్తుతం సచిన్ ఆరోగ్యం నిలకడగానే ఉండగా, డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. తాజాగా రోడ్ సేఫ్టీ సిరీస్ లో పాల్గొన్న సచిన్ టెండూల్కర్ తో పాటు ఇతర క్రికెటర్ లైన యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బద్రీనాథ్ కి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.