ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లుగా రెండు జట్లు విజయం కోసం పోటీ పడ్డాయి. అయితే చివరకు బెంగళూరును విజయం వరించింది. ముంబైపై ఆ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచి బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా ముంబై బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్‌మెన్లలో క్రిస్ లిన్, సూర్య కుమార్ యాదవ్‌లు రాణించారు. 35 బంతులు ఆడిన లిన్ 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేయగా, 23 బంతుల్లో యాదవ్ 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 31 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 5 వికెట్లు తీయగా, కైలీ జేమిసన్, వాషింగ్టన్ సుందర్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు తడబడుతూ వచ్చింది. అయినప్పటికీ ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్, కోహ్లిలు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో డివిలియర్స్ (48 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మాక్స్‌వెల్ (39 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (33 పరుగులు, 4 ఫోర్లు)లు రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా, జాన్‌సెన్‌లు చెరో 2 వికెట్లు తీశారు. ట్రెంట్ బౌల్ట్, క్రునాల్ పాండ్యాలకు చెరొక వికెట్ దక్కింది.