చౌటుప్పల్‌లోని రాంనగర్ కాలనీలో ఓ తల్లి ఇటీవల తన ఇద్దరు కుమార్తెలకు ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాగుబోతు భర్తను భరించలేక ఆమె ఆ అఘాయిత్యానికి పాల్పడింది. అయితే ఆ సంఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులను కూడా ఆ సంఘటన కలచి వేసింది. తొర్పునూరి వెంకటేశం అనే వ్యక్తి మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురి చేస్తుండడంతోనే అతని భార్య ఆత్మహత్య చేసుకుంది. పిల్లలకు ఉరి వేసి తరువాత తాను ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఉమారాణి, హర్షిణి, లాస్యల మృతదేహాలకు గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే మృతురాలు ఉమారాణి అన్న సందగళ్ల మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశంను పోలీసులు అరెస్టు చేశారు. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు అతన్ని అరెస్టు చేయవద్దని కుటుంబ సభ్యులు కోరగా ఆ కార్యక్రమం ముగిసే వరకు పోలీసులు వేచి చూశారు. తరువాత అతన్ని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
కాగా ఉమారాణి మూడో కుమార్తె 3 ఏళ్ల శైనీని చూసి కుటుంబ సభ్యులు, స్థానికులు దుఃఖిస్తున్నారు. తన తల్లి, ఇద్దరు అక్కలకు ఏమైందో కూడా తనకు తెలియదు. ఫోన్‌లో వారి ఫొటోలను చూస్తూ వారు వస్తారేమోనని ఎదురు చూస్తోంది. తల్లి, అక్కలు ఎటు వెళ్లారని అడిగితే ఉయ్యాల ఊగి ఊరికి వెళ్లారని చెబుతోంది. మళ్లీ వారు వస్తారా అని అడిగితే వారు చనిపోయారుగా, ఇంక రారు.. అని అమాయకంగా శైనీ సమాధానం చెబుతోంది. దీంతో ఆమెను చూస్తున్న వారి గుండె తరుక్కుపోతోంది. ఆమె అమాయకత్వాన్ని చూసిన వారు కళ్లలో నీళ్లు పెట్టుకుంటున్నారు.