భయంకరమైన కరోనా మహమ్మారి బారిన పడి దేవుడి దయవల్ల బతికి బట్ట కడుతుంటే బ్లాక్ ఫంగస్ రూపంలో మృత్యువు మరోసారి వెంటాడుతోంది. కరోనా నుంచి పోరాడి బయటపడిన వారు బ్లాక్ ఫంగస్ వల్ల మరణిస్తున్నారు. ఫంగస్ ఏర్పడటం వల్ల కళ్ళు, దవడ, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కి గురవుతున్నాయి.ఈ క్రమంలోనే ఎంతో మంది చూపును కోల్పోవడమే కాకుండా కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన 42సంవత్సరాల గురజాల అంజల్ రెడ్డి బ్లాక్ ఫంగస్ తో మృతి చెందాడు. గత నెల 22న కరోనా బారిన పడిన అంజల్ రెడ్డికి నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ నెల 10వ తేదీన అతని పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అంజల్ రెడ్డికి కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ సోకడంతో ఈనెల 11వ తేదీన అతని దవడ, కన్నును వైద్యులు తొలగించారు. దీంతో అంజల్ రెడ్డి హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటూనే ఆదివారం మృతి చెందాడు. ఈ విధంగా వల్ల మరణించడంతో ప్రజలలో మరింత భయాందోళనలు కలుగుతున్నాయి.