తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రేషన్ కార్డులు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే ఆ కార్డులను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మొత్తం 4,46,169 మంది లబ్ధిదారులకు వెంటనే కార్డులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరో 15 రోజుల్లోగా అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కార్డులను జారీ చేయాలని కేబినెట్ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా మంగళవారం జరిగిన తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ సమావేశంలో వ్యవసాయ శాఖపై సమీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై రాష్ట్ర కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. గతేడాది వర్షాకాలం, వేసవి కలిపి మొత్తం 1,06,03,927 ఎకరాల్లో కేవలం వరి పంటనే రైతులు సాగు చేశారు. దీంతో సుమారుగా 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. దీనిపై కూడా కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్బంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అధికారులు, సిబ్బందిని కేబినెట్ అభినందించింది. కాగా రాష్ట్రంలో మొత్తం 2,601 వ్యవసాయ క్లస్టర్లలో ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉంటూ రైతు వేదికల ద్వారా వారికి సలహాలు, సూచనలు అందజేయాలని సూచించింది. అలాగే ఖరీఫ్ కోసం పంటలు వేసేలా రైతులను సిద్ధం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంది. ఇక చేపలు, గొర్రెల పెంపకం తదితర రంగాల్లో కీలకమైన కృషి చేస్తునన్న రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కూడా కేబినెట్ అభినందించింది.