Hanuman : మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆంజనేయ స్వామికి అనేక చోట్ల ఆలయాలు ఉన్నాయి. ఆయన చిరంజీవి. సూర్యుడి వద్ద అనేక విద్యలను నేర్చుకున్నాడు. హనుమంతుడిది రుద్రాంశ. అందువల్ల ఆయనను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక హనుమంతుడికి ఉన్న 9 అవతారాల్లో పంచముఖ ఆంజనేయ స్వామి అవతారం ఒకటి. ఇది అత్యంత శక్తివంతమైన అవతారం అని చెబుతారు.
ఆంజనేయ స్వామి, హయగ్రీవ స్వామి, వరాహ స్వామి, నృసింహ స్వామి, గరుడ స్వామి కలిసిన అత్యంత శక్తివంతమైన అవతారం.. పంచముఖ అవతారం. ఈ క్రమంలోనే పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి కష్టాల నుంచి అయినా బయట పడవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.
హనుమను భక్తి శ్రద్ధలతో పూజించాలి. దీంతో ఆయన కోరిన కోర్కెలను నెరవేరుస్తాడు. హనుమకు 5 అనే అంకె అంటే ఎంతో ఇష్టం. కనుక ఆయన ఆలయంలో గర్భగుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. అలాగే 5 అరటి పండ్లను సమర్పించాలి. మంగళవారం రోజు హనుమను పంచముఖ అవతారంలో పూజిస్తే ఎంతో మంచిది. ఆయనను ఆరోజున తమలపాకులతో పూజించాలి. దీంతో సకల శుభాలు కలుగుతాయి. ఆయురారోగ్యాలను ఇస్తాడు.
హనుమకు పూజ చేసే సమయంలో అప్పాలను కూడా సమర్పించాలి. దీంతో బుద్ధి బలం, కీర్తి, ధైర్యం, ఆరోగ్యం, చురుకుదనం, మాటకారితనం అన్నీ ఇస్తాడు. తమలపాకులు, మారేడు, తులసి, ఉసిరి, గరిక, నేరేడు, జమ్మి, ఉత్తరేణి, జిల్లేడు ఆకులతో హనుమంతుడి పూజ చేయాలి. మొల్ల, మల్లి, మందార, పారిజాత, నీలాంబర, కనకాంబర, నంది వర్ధనం, మెట్ట తామర పూలు హనుమంతుడుకి ఇష్టమైనవి. నిమ్మ, అరటి, పనస, మామిడి, ద్రాక్ష, దానిమ్మ పండ్లు, చెరకు గడలు అన్నా కూడా ఇష్టమే. జిల్లేడు చెట్టు కింద హనుమంతుడిని పూజిస్తే ఎంతో మంచిది. సింధూరంతో మంగళవారం రోజు హనుమంతుడిని పూజించాలి. దీంతో ఏ పనిచేసినా లాభదాయకంగా ఉంటుంది. ఇక హనుమంతుడికి పెట్టే నైవేద్యంలోని పదార్థాలు కూడా 5 అంకెలో ఉండాలి. అప్పుడే ఆయన ప్రీతి చెందుతాడు. ఇక హనుమను పూజించే సమయంలో కచ్చితంగా శ్రీరాముడికి కూడా పూజ చేయాలి. దీంతో ఆంజనేయ స్వామి పరవశించి పోతాడు. మనం కోరుకున్న కోరికలను నెరవేరుస్తాడు.