దేశంలో రెండవ దశ కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చడంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతోంది. దీంతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోయింది. ఒక్కసారిగా కరోనా బాధితులు పెరగడంతో ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కొరత ఏర్పడింది. పడకలు కొరతతో పాటు, ఆక్సిజన్ కొరత ఏర్పడటం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.
ఇటువంటి సమయంలోనే ఆక్సిజన్ సరఫరాకు భారత రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని భారత రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ముంబై సమీపంలోని కలంబోలి, బోయ్సర్ స్టేషన్ల నుంచి సోమవారం ఉదయం ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లతో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు బయలుదేరుతాయి. మెడికల్ ఆక్సిజన్ లభ్యత అధికంగా ఉండే విశాఖపట్నం, జంషెడ్పూర్, రూర్కెలా, బోకరో ప్రాంతాల నుంచి ప్రాణవాయువును తీసుకువస్తాయి.
ఈ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు పూర్తిగా”గ్రీన్ ఛానల్” మార్గంలోనే పయనిస్తాయి. ఈ రైలు ప్రయాణించే సమయంలో ఆ మార్గంలో వస్తున్న రైళ్లను నిలిపివేస్తారు. ఈ రైలు ప్రయాణించే మార్గాలలో ఉండే ఓవర్ బ్రిడ్జ్, ఎత్తులను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్ ట్యాంకర్ ట్రక్కులను తీసుకువెళ్లాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఈ సేవలను అందిస్తున్నారు.