రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు పలు సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్న విషయం విదితమే. ఫోన్లను చార్జింగ్ పెట్టుకునేందుకు కూడా సదుపాయం అందుబాటులో ఉంటుంది. అయితే రైలు ప్రయాణికులు ఇకపై కేవలం పగటిపూట మాత్రమే ఫోన్లకు చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. రాత్రి పూట ఫోన్లకు చార్జింగ్ పెట్టుకోవడాన్ని నిషేధించారు.
రైళ్లలో ఇకపై ప్రయాణికులు రాత్రి 11 నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఫోన్లను చార్జింగ్ పెట్టుకునేందుకు వీలు లేదు. అందుకు గాను చార్జింగ్ పాయింట్లకు చెందిన స్విచ్‌లను ఆఫ్ చేస్తారు. కేవలం పగటి పూట మాత్రమే ఫోన్లను చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇటీవల మార్చి 13వ తేదీన ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు బయల్దేరి వెళ్లిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటన నేపథ్యంలోనే రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
రైళ్లలో రాత్రిపూట ఫోన్లను, ల్యాప్‌టాప్‌లను చార్జింగ్ చేసేవారు వాటిని చార్జింగ్ పెట్టి వదిలేస్తారు. దీంతో అవి ఓవర్ హీట్ అయ్యి పేలిపోతాయి. ఫలితంగా రైళ్లలో మంటలు అంటుకుంటాయి. పైన తెలిపిన ప్రమాదం కూడా అలాగే జరిగింది. దీంతో అనేక కోచ్‌లు కాలిపోయాయి. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండడం కోసమే రైళ్లలో ఇకపై రాత్రి పూట చార్జింగ్‌కు అనుమతించడం లేదు.
రైళ్లలో సిగరెట్లు కాల్చేవారిపై, మంటలు సులభంగా అంటుకునే వస్తువులను తీసుకెళ్లేవారిపై కూడా రైల్వే కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉన్న ఫైన్‌ను పెంచడం, జైలు శిక్షను పెంచడం వంటి చర్యలు చేపట్టాలని ఆలోచిస్తోంది. మరి ఆ దిశగా రైల్వే ఎలాంటి నిర్ణయాలను అమలు చేస్తుందో చూడాలి.