దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. రోజుకు 3.50 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అనేక హాస్పిటళ్లలో బెడ్లు సరిపోవడం లేదు. అలాగే వైద్య సదుపాయాల కొరత కూడా ఏర్పడింది. తగినంత మంది డాక్టర్లు, సిబ్బంది కూడా లేరు. మరోవైపు కరోనా మూడో వేవ్ కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇవి చాలదన్నట్లు ప్రముఖ వైద్య నిపుణుడు దేవి ప్రసాద్ శెట్టి ఆందోళన కలిగించే విషయాలను వెల్లడించారు.
రానున్న రోజుల్లో దేశంలో భారీ ఎత్తున కోవిడ్ కేసులు నమోదవుతాయని డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారుతుందన్నారు. ప్రస్తుతం భారత్‌లో 75వేల నుంచి 90వేల వరకు మాత్రమే ఐసీయూ బెడ్లు ఉన్నాయని, కానీ రానున్న రోజుల్లో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి భారీ సంఖ్యలో ఐసీయూ బెడ్లు, వైద్య సిబ్బంది, సదుపాయాలు అవసరం అవుతాయన్నారు.
కోవిడ్ కేసుల సంఖ్య రోజుకు 10 లక్షలు నమోదు అయితే అదనంగా మరో 5 లక్షల ఐసీయూ బెడ్లు, 2 లక్షల మంది నర్సులు, 1.50 లక్షల మంది డాక్టర్లు అవసరం అవుతారని, కానీ దేశంలో ఇంత మంది వైద్యులు, సిబ్బంది లేరని, సదుపాయాలు కూడా లేవని అన్నారు.
అయితే ఎంబీబీఎస్, మెడిసిన్ పీజీ చదువుతున్నవారు, విదేశాల్లో మెడిసిన్ చదివి వచ్చి ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయని వారు చాలా మంది ఉన్నారని, వారందరినీ విధుల్లోకి తీసుకుంటే కరోనాపై పోరాడవచ్చని, ఇందుకు కేంద్రం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని అన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మరి ఈ విషయంలో కేంద్రం ఏం చేస్తుందో చూడాలి.