కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏపీకి చెందిన వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. ఏపీలో ఎన్400కె అనే కొత్త వేరియెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) తెలిపింది. విశాఖపట్నంతోపాటు ఆ రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ ఈ వేరియెంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలియజేసింది. అందువల్లే ఏపీలో కోవిడ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
కాగా ఈ కోవిడ్ స్ట్రెయిన్ ముందుగా కర్నూల్‌లో గుర్తించబడిందని, పాత వేరియెంట్ల కన్నా కొత్త స్ట్రెయిన్ 15 రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు తెలిపారు. ఇండియన్ వేరియెంట్లయిన బి1.617, బి1.618ల కన్నా ఈ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్‌కు చెందిన శాంపిల్స్‌ను సేకరించాం, సీసీఎంబీకు పరిశీలన నిమిత్తం పంపించాం. అయితే కోవిడ్ మొదటి వేవ్ కన్నా ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న వేరియెంట్ భిన్నంగా ఉందని తెలిసింది.. అన్నారు.
జిల్లా కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ పీవీ సుధాకర్ మాట్లాడుతూ.. కొత్త కోవిడ్ వేరియెంట్ ఇంకుబేషన్ సమయం చాలా తక్కువగా ఉందని, వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. గతంలో కోవిడ్ బారిన పడినప్పుడు శ్వాస అందని స్థితి వచ్చేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టేదని, కానీ ఇప్పుడు కొత్త వేరియెంట్ వల్ల ఆ స్థితి కేవలం 3-4 రోజుల్లోనే వస్తుందన్నారు. అందువల్ల బెడ్లు, ఆక్సిజన్‌కు కొరత ఏర్పడిందన్నారు.
ఇక కొత్త కోవిడ్ వేరియెంట్‌కు తక్కువ సమయం పాటు ఎక్స్‌పోజ్ అయినప్పటికీ ఏకంగా 4-5 మందికి వైరస్ సోకుతుందన్నారు. ఈ క్రమంలోనే కొత్త వేరియెంట్‌ను అసలు అంచనా వేయలేకపోతున్నామని అన్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుందన్నారు.