Fennel Seeds : సోంపు గింజల గురించి అందరికీ తెలిసిందే. భోజనం అనంతరం వీటిని నోట్లో వేసుకుని తింటారు. దీంతో తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుందని భావిస్తారు. అలాగే మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఇవి పనిచేస్తాయి. అయితే సోంపు గింజలతో ఈ రెండు ఉపయోగాలే ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ వీటితో కలిగే ప్రయోజనాల గురించి పూర్తిగా తెలిస్తే అసలు వీటిని ఎవరూ విడిచిపెట్టరు. ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను ఇవి అందిస్తాయి. ఈ క్రమంలోనే భోజనం చేసిన అనంతరం ఒక టీస్పూన్ సోంపు గింజలను నోట్లో వేసుకుని నమిలి మింగితే చాలు.. ఎన్నో లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సోంపు గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి.. ఇలా అన్ని జీర్ణ సమస్యలకు ఒకేసారి చెక్ పెట్టవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ గింజలను తింటే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే ఈ గింజలను రోజూ తినే వారిలో క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. కనుక సోంపు గింజలను రోజూ తినాలి.
ఈ గింజలలో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. మహిళలు నెలసరి సమయంలో ఈ గింజలను తినడం వల్ల ఆ సమయంలో వచ్చే నొప్పులు, అధిక రక్తస్రావం వంటి సమస్యలను అరికట్టవచ్చు. అలాగే హార్మోన్ల అసమతుల్యత లేకుండా చూస్తాయి కనుక మహిళలు తప్పనిసరిగా రోజూ ఈ గింజలను తినాలి. వీటిలో ఎక్స్‌పెక్టోరెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల మ్యూకస్‌లు పలుచగా చేస్తాయి. దీంతో దగ్గు, జలుబు, బ్రాంకైటిస్ వంటి శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
సోంపు గింజలను తినడం వల్ల నోరు తాజాగా మారుతుంది. అలాగే నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఈ గింజలను నీటిలో వేసి మరిగించి రోజూ ఒక కప్పు మోతాదులో తాగుతుండడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. ఇక వీటిల్లో పాలకన్నా 10 రెట్లు ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. అలాగే ప్రోటీన్లు కూడా లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. కనుక సోంపు గింజలను రోజూ భోజనం తరువాత ఒక టీస్పూన్ మోతాదులో తినడం మరిచిపోకండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.