సాధారణంగా మనం ఏ విధమైన కూరలు వండాలో దిక్కు తెలియని నేపథ్యంలో ఈ విధమైనటువంటి రైస్ రెసిపీలను తయారు చేసుకొని తింటాము. అయితే స్వీట్ కార్న్ రైస్ రెసిపీ తినడానికి రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*బాస్మతి రైస్ రెండు కప్పులు
*స్వీట్ కార్న్ 2 కప్పులు
*ఆనియన్స్ అర కప్పు
*ఉప్పు తగినంత
*కారం అర టీ స్పూన్
*పసుపు చిటికెడు
*కరివేపాకు రెమ్మ
*కొత్తిమీర తురుము
*నాలుగు పచ్చిమిర్చి ముక్కలు
*జీలకర్ర అర టీ స్పూన్
*నూనె తగినంత
తయారీ విధానం
ముందుగా బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోసి బాగా పొడిపొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్వీట్ కార్న్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎర్రబడగానే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు రెమ్మ వేసి బాగా కలియబెట్టాలి. ఉల్లిపాయ ముక్కలు ముదురు ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత అందులో చిటికెడు, కారం, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. రెండు నిమిషాల తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్స్ వేసి మరోసారి కలియబెట్టాలి. అవసరం అనుకుంటే ఇందులోకి గరంమసాల వేసుకోవచ్చు.రెండు నిమిషాల తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న బాస్మతి రైస్ వేసి కలియబెట్టి , కొత్తిమీర తురుము చల్లుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ రైస్ తయారైనట్లే.