సాధారణంగా సాంబారు కొందరు వివిధ రకాల కూరగాయలతో తయారు చేసుకుంటారు. మరికొందరు మునక్కాడలతో సాంబార్ తయారు చేసుకుంటారు. మీ మునక్కాడల సాంబార్ తినడానికి పిల్లలు సైతం ఎంతో ఇష్ట పడుతుంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన, రుచికరమైన సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*కందిపప్పు ఒక కప్పు
*మునక్కాడలు
*ఉల్లిపాయ ఒకటి
*కారం ఒక టేబుల్ స్పూన్
*ఉప్పు తగినంత
*చింతపండు చిన్న ఉల్లిపాయ సైజు
*మెంతులు అర టేబుల్ స్పూన్
*పసుపు చిటికెడు
*ఆవాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్
*నూనె తగినంత
*కరివేపాకు రెమ్మ
*నీళ్లు లీటర్
తయారీ విధానం
ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి నీటిని పోసి ఆ నీటిని బాగా మరిగించాలి. నీరు మరుగుతుండగా సమయంలో కందిపప్పును కడిగి అందులో వేసుకోవాలి. కందిపప్పు 70శాతం ఉడికిన తరువాత అందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న మనగ కాయలను వేయాలి. మునగ కాయలను 2 నిముషాలు ఉడికించిన తరువాత చిటికెడు పసుపు ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలను మునగ కాయలను ఉడికించాలి. ఈలోగా మరొక స్టవ్ పై కడాయి ఉంచి మెంతులు దోరగా వేయించుకోవాలి. అలాగే చింతపండును కూడా నానబెట్టుకోవాలి. మునగకాడలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులోకి టేబుల్ స్పూన్ కారం వేయాలి. మరో ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించిన తరువాత చింతపండు బాగా నలిపి చింత పులుపు వేయాలి. చింతపులుసు వేసిన రెండు నిమిషాలకు తగినంత ఉప్పును వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. చివరిగా దోరగా వేయించుకొని మెంతులను పొడిచేసి మెంతుల పొడి సాంబారులో వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన మునక్కాడల సాంబార్ తయారైనట్లే.