సాధారణంగా మనం లెమన్ రైస్, పులిహోర చేసుకున్న విధంగానే ఎంత తొందరగా రుచికరంగా కొత్తిమీర రైస్ తయారు చేసుకోవచ్చు.తినడానికి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా ఎంతో ఆరోగ్యకరమైన ఈ కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*వండిన అన్నం ఒక కప్పు
*కొత్తిమీర తురుము ఒక కప్పు
*పచ్చిమిర్చి 2
*అల్లం చిన్న ముక్కలు రెండు
*ఉల్లిపాయ ఒకటి
*ఆవాలు జీలకర్ర టేబుల్ స్పూన్
*శనగపప్పు టీ స్పూన్
*మినప్పప్పు టీ స్పూన్
*ఉప్పు తగినంత
*నూనె కొద్దిగా
తయారీ విధానం
ముందుగా అన్నం పొడిపొడిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత శెనగపప్పు, మినప్పప్పు వేయాలి. శనగపప్పు కొద్దిగా ఎర్రబడిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి కలియబెట్టాలి. ఆవాలు వేసిన రెండు నిమిషాల తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా కాగానే, ముందుగా తయారు చేసి పెట్టుకొన్న కొత్తిమీర మిశ్రమాన్ని తగినంత ఉప్పు వేసి చిన్న మంటపై ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొత్తిమీర పచ్చివాసన వెళ్లిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న అన్నం ఇందులో వేసి కలుపుకుంటే రుచికరమైన కొత్తిమీర రైస్ తయారైనట్లే.