సాధారణంగా కొందరు చేపలు తినడానికి ఇబ్బంది పడుతుంటారు. చేపలలో ముళ్ళు ఉంటాయని భావించి చేపలను పూర్తిగా దూరం పెడుతుంటారు. కానీ చేపలు తినడం వల్ల ఎన్నో పోషకాలను మనం పొందవచ్చు. అయితే చేపలను పులుసుగా తయారు చేసుకొని తినడం ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలు మెండుగా లభిస్తాయి. రుచికరమైన చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*చేపలు ఒక కిలో
*వెల్లుల్లి ఒకటి
*ఉల్లిపాయ ఒకటి
*చింతపండు గుప్పెడు
*కొత్తిమీర
*పసుపు చిటికెడు
*కారం టేబుల్ స్పూన్
*ధనియాల పొడి టేబుల్ స్పూన్
*ఉప్పు తగినంత
*లవంగాలు 5
*కొబ్బెర తురుము చిన్నకప్పు
*నూనె
*నీరు కావలసినంత
తయారీ విధానం
ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలను ఉప్పు నీటి గిన్నెలో వేయాలి. ఈలోగా చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. తరువాత పులుసు తయారు చేయడం కోసం మసాలాను తయారు చేయాలి. మిక్సీ గిన్నెలోకి ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, కొబ్బెర, లవంగాలు ధనియాల పొడి, కారం పొడి వేసి మసాలా తయారుచేసుకోవాలి.
స్టవ్ పై ఒక గిన్నె ఉంచి అందులో కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులోకి పోపు దినుసులు వేసుకోవడం వేయకపోవడం అనేది మన ఇష్టం. నూనె వేడి అయిన తర్వాత ముందుగా తయారు చేసుకొన్న మసాలా మిశ్రమాన్ని, చిటికెడు పసుపు వేయాలి. చిన్న మంటపై మసాలా బాగా మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మసాలాలోకి మనకు కావలసినంత నీటిని వేసి మూత పెట్టాలి.ఆ మసాలా బాగా ఉడుకుతున్న క్రమంలో చింతపండు పులుసు తయారు చేసుకొని ఆ చింతపండు పులుసును ఉడుకుతున్న మిశ్రమంలో వేయాలి. ఈ విధంగా చింతపండు పులుసు మొత్తం వచ్చేవరకు మరికొన్ని నీటిని జోడించుకొని చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ విధంగా కాసేపు చింతపండు పులుసు పొడిచిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేపముక్కలను వేయాలి. చేపలు వేసిన తర్వాత తగిన మోతాదులోనే ఉప్పును వేసుకోవాలి. చేపముక్కలు వేసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ కూరను తరచూ కలియబెట్టి కూడదు. ఒక ఐదు నిమిషాల పాటు చేపను ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన చేపల పులుసు తయారైనట్టే. చేపల పులుసు వేడివేడిగా కంటే చల్లబడిన తర్వాత ఎంతో అద్భుతంగా ఉంటుంది.