ప్రస్తుత కాలంలో ఎంతో మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలలో మధుమేహ సమస్య ఒకటి. మధుమేహంతో బాధపడే వారు వారి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను అదుపులో చేయడం కోసం కఠినమైన ఆహార నియమాలను పాటిస్తారు. అదేవిధంగా ఎన్నో రకాల పండ్లకు దూరంగా ఉంటారు. కానీ మధుమేహంతో బాధపడే వారు అల్ల నేరేడు పండ్లను తినడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అల్ల నేరేడు పండ్లలో తక్కువ స్థాయిలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లభిస్తాయి.అదే విధంగా తక్కువ కేలరీలను కలిగి ఎక్కువ ఖనిజాలను కలిగి ఉండటం వల్ల ఇవి మన శరీరంలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయడానికి దోహదపడతాయి. కేవలం ఈ పండ్లు మాత్రమే కాకుండా వీటి విత్తనాలలో కూడా చక్కెర వ్యాధిని అదుపు చేసే లక్షణాలు ఉన్నాయి.
అల్ల నేరేడు పండ్ల విత్తనాలను ఎండబెట్టి పొడి చేసుకుని తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ను అదుపు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే డయాబెటిస్ ప్రారంభ దశలోనే వీటిని తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం చేత కంటి ఆరోగ్యానికి, మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది. కనుక డయాబెటిక్ పేషెంట్లకు అల్ల నేరేడు పండ్లు ఒక వరమని చెప్పవచ్చు.కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం లో కూడా ఈ పండ్లు కీలకపాత్ర పోషిస్తాయి.