ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతుంటాయి. అయితే ఆ కష్టాలను ఎదుర్కొని మన ప్రయత్నం మనం చేసినప్పుడే అంతిమంగా విషయాన్ని పొందుతాము. ఈ విధంగా ఎన్నో కష్టాలని ఎదుర్కొని మంచి స్థానంలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తారు. ఇలాంటి స్ఫూర్తి ఒక నైట్ వాచ్ మెన్ గా పని చేసే యువకుడిని అసిస్టెంట్ ప్రొఫెసర్ ను చేసింది.
కేరళకు చెందిన రంజిత్ రామచంద్రన్ కష్టాలకు కుంగిపోకుండా, చదువుపై ఉన్న శ్రద్ధతో, తన చదువుకు తన పేదరికం అడ్డురాకుడదని రాత్రిపూట టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద వాచ్ మెన్ విధులను నిర్వహిస్తూ, ఉదయం కాలేజీకి వెళ్లి చదువుకుంటూ.. తన కష్టాలతో ఎదురీదాడు. ఆ కష్టమే ఇప్పుడు అతని అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థానంలో నిలబెట్టింది. ఐఐఎం రాంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న 28 ఏళ్ల రంజిత్ తన వివరాలను ఫేస్ బుక్ ద్వారా పంచుకున్నారు.
రంజిత్ కాసర్‌గఢ్ పీయూస్ కాలేజీ నుంచి ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.రాత్రి పూట వాచ్ మెన్ గా చేస్తూ ఉదయం కాలేజీకి వెళ్లి చదువుకున్న రంజిత్ మంచి ఉత్తీర్ణత సాధించారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ సీటు సంపాదించారు. కేవలం మలయాళం మాత్రమే వచ్చిన రంజిత్ ఇంగ్లిష్ పై పట్టు లేకపోవడంతో ఎంతో ఇబ్బంది పడ్డాడు.చివరికి పీహెచ్‌డీ కోర్సు మధ్యలోనే వదిలి రావాలని భావించినప్పుడు గైడ్ డాక్టర్ సుభాష్ సహకారంతో కోర్సు పూర్తి చేశారు. ‘కలలను సాకారం చేసుకోడానికి పోరాటం చేయాలనే పట్టుదలతో గత ఏడాది పీహెచ్ డీ కోర్సు పూర్తి చేసి డాక్టరేట్ పొందానని తెలిపారు.
డాక్టరేట్ పొందిన రంజిత్ రెండు నెలలు బెంగళూరు క్రిస్ట్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశానని పేర్కొన్నారు. తాజాగా ఐఐఎం రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయాన్ని రంజిత్ ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేయడంతో ఎంతో మంది లైక్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. రంజిత్ తన పోస్ట్ కు వచ్చిన స్పందన చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నా పోస్ట్ వైరల్ అవుతుందని అనుకోలేదు కానీ..కొందరికైనా స్ఫూర్తిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పోస్ట్ చేసినట్లు తెలిపారు. రంజిత్ చేసిన ఈ పోస్ట్ కేరళ ఆర్థిక శాఖ మంత్రి స్పందించి అతనికి శుభాకాంక్షలు తెలియజేశాడు.