ఈ కాలంలో చాలామంది చద్దన్నం అంటేనే తినడానికి ఇష్టపడరు. కానీ పూర్వకాలంలో మిగిలిన అన్నానికి మరుసటి రోజు ఉదయం కాస్త పెరుగు జోడించి తినడం వల్ల ఎంతో రుచిగా ఉంటుందని భావించేవారు. కానీ ప్రస్తుత కాలంలో అన్నం తినటం వల్ల అనేక రోగాలు వస్తాయని చాలామంది భావిస్తుంటారు. కానీ చద్దన్నం ఎన్నో వ్యాధులకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద, అల్లోపతి వైద్యులు తెలియజేస్తున్నారు.
చద్దన్నం అంటే రాత్రి మిగిలిపోయిన అన్నం మరుసటి రోజు తినడం కాదు. పూర్వ కాలంలో బాగా పొయ్యిపై వండి వార్చి ఆ అన్నాన్ని మట్టికుండలో వేసి నీళ్లు పోసి, వాటిలో నిమ్మ ఆకులను వేసి రెండు రోజుల పాటు పెట్టేవారు. ఈ విధంగా అన్నాన్ని పులియబెట్టడం వల్ల అందులో ప్రోబయోటిక్స్ పెరుగుతాయి. ఇది మన శరీరానికి జీర్ణక్రియను మెరుగు పరచడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి.
ఈ విధంగా పులియబెట్టిన అన్నాన్ని ఉదయం పెరుగు లేదా మజ్జిగలో తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దేశవ్యాప్తంగా చద్దన్నం తినటం వాడుకలో ఉంది.బిహారీలు జీల్‌బాత్; తమిళులు పళయ సాదమ్; బెంగాల్, ఒడిశాల్లో పఖాలా బాత్ అంటారు. ప్రతి ఏటా మార్చి నెలలో చద్దన్నం దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆరోజు ఒడిశాలోని ప్రముఖ స్టార్ హోటళ్ల మెనూలో చద్దన్నం తప్పకుండా ఉంటుంది. పులియబెట్టిన ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి కాల్షియం మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తున్నాయి.సాధారణ ఆహారం కంటే పులియబెట్టిన ఆహారంలో 21 శాతం అదనపు పోషకాలను పొందవచ్చని నిపుణులు తెలియజేయడంతో అందరి దృష్టి చద్దన్నం వైపు మళ్ళింది.