కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా మొదటి వేవ్ సమయంలో మాస్కులను ధరించడంపై అనేక మందికి అనేక సందేహాలు వచ్చాయి. ఇప్పుడు కూడా మళ్లీ అవే సందేహాలు వస్తున్నాయి. మాస్కులను ఎక్కువ సేపు ధరించడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయని, కార్బన్ డయాక్సైడ్‌కు శరీరం విషతుల్యంగా మారుతుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మాస్కులను ఎక్కువ సమయం పాటు ధరించడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయనే వార్త పూర్తిగా అబద్ధమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తన ఫ్యాక్ట్ చెక్‌లో తెలియజేసింది. గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయని, అవన్నీ అబద్దమని తేల్చి చెప్పింది. మాస్కులను ధరించడం వల్ల కొందరికి అసౌకర్యంగా ఉంటుందని, అంతేకానీ శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గవని తెలిపింది. అయితే వైద్యులు, వైద్య సిబ్బంది ఎక్కువ సమయం పాటు మాస్కులను, పీపీఈ కిట్లను ధరిస్తారు కనుక వారిలో తలనొప్పి, ముఖం నొప్పి, వాపులు వంటి సమస్యలు వస్తాయని, అంతేకానీ వారిలో కూడా ఆక్సిజన్ స్థాయిలు తగ్గవని, అదంతా అబద్దమని తేల్చి చెప్పింది.
https://twitter.com/PIBFactCheck/status/1391661461508825090
కోవిడ్ మొదటి వేవ్‌లో అందరూ సింగిల్ మాస్క్‌నే ధరించారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్‌లో కొత్త కొత్త కరోనా వేరియెంట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు రెండు మాస్కుల చొప్పున ధరించాలని, కోవిడ్ బాధితులు అయితే 3 మాస్క్‌లను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులను ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించడం వల్ల కూడా కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెబుతున్నారు.