హాస్యబ్రహ్మ, నవ్వుల రారాజు, కామెడీ కింగ్ అని ఇలా ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా తక్కువే. ఏదైనా మీమ్స్ సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిందంటే దాంట్లో బ్రహ్మానందానికి సంబంధించిన కామెడీ ఫేస్ కనిపించవలసిందే. ఆయన కనుబొమ్మ అలా ఎగరేస్తే చాలు ప్రేక్షకుడి పొట్ట చెక్కలయ్యేలా నవ్వవలసిందే. ఒక చిత్రంలో బ్రహ్మానందం నటించారంటే కామెడీ పరంగా ఆ సినిమా సక్సెస్ సాధించాల్సిందే. ప్రస్తుతం బ్రహ్మానందం వయసు రిత్యా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తూ తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతున్నారు. అంతేకాకుండా అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తూ తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు బ్రహ్మానందం.
హాస్యనటుడిగా చిత్రపరిశ్రమకు తన ఎనలేని సేవలు అందించి పద్మశ్రీ పురస్కారాన్ని సైతం అందుకున్నారు బ్రహ్మానందం. ఇంత గొప్ప నటుడు ఈ స్థాయికి రావడానికి తన ముందు జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. 1956 ఫిబ్రవరి 1న ఆంధ్రప్రదేశ్, సత్తెనపల్లిలో ఒక పేద కుటుంబమైనా కన్నెగంటి నాగలింగాచారి, లక్ష్మీనరసమ్మ దంపతులకు బ్రహ్మానందం జన్మించారు. సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో ప్రాథమిక విద్యను, భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో MA పూర్తి చేశారు. ఆ తర్వాత అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశాక నటన మీద మక్కువతో సినీరంగంలోకి అడుగుపెట్టారు.
కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో పాఠాలు బోధిస్తూ అప్పుడప్పుడూ మిమిక్రీ చేస్తూ విద్యార్థులను నవ్వించేవారు. ఓ రోజు అత్తిలి గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి బ్రహ్మానందం హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో మిమిక్రీ చేస్తూ ప్రజలను కడుపుబ్బ నవ్వించారు బ్రహ్మి. ప్రజలందరు నవ్వడం చూసి అప్పుడే అక్కడకు వచ్చిన ఊరి ప్రెసిడెంట్ అందర్నీ నవ్వకూడదు అంటూ హెచ్చరించారట. ఆయనఒక తెలుగు లెక్చరర్.. ఆయనను చూసి గౌరవం లేకుండా అలా నవ్వుతారా అంటూ ప్రశ్నించారట ఆయనను చూసి నవ్వితే శిక్ష వేస్తానని వార్నింగ్ ఇచ్చారట ఆ ఊరి ప్రెసిడెంట్. ఇక ఆ తరవాత ప్రెసిడెంట్ అక్కడ నుండి వెళ్లిపోయిన కూడా బ్రహ్మానందం జోకులు వేసినా, మిమిక్రీ చేసిన ప్రజలందరూ చూస్తుండిపోయారు తప్ప నవ్వేలేదట. ఈ విషయాన్ని బ్రహ్మానందం ఒక ఇంటర్వ్యూలో ఆయనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.