తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. జమున హ్యాచరీస్ కోసం పేదల నుంచి ఆయన కుటుంబం స్థలాలను బలవంతంగా లాక్కుందనే ఆరోపణలపై కేసు నడుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే హైకోర్టు కీలక ఆదేశాలు కూడా ఇచ్చింది. అధికారులు సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అయితే ఆ విషయం అటుంచితే ఇప్పుడు ఈటల భవిష్యత్తు ఏమిటి ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈటల తెరాసలో కొనసాగే అవకాశం అస్సలు లేదు. అయిపోయింది. నేడో, రేపో ఆయన ఎమ్మెల్యే పదవికి, తెరాస సభ్యత్వానికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అయితే తదుపరి ప్రణాళిక ఏమిటి ? కొత్త పార్టీ పెట్టాలా ? ఏదైనా వేరే పార్టీలో చేరాలా ? అని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకనే తన నియోజకవర్గ ప్రజలు, అనుచరులు, అభిమానులతో ఆయన చర్చలు జరుపుతున్నారు. అయితే ఈటల రాజేందర్ బీజేపీలోనే చేరుతారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య ధోరణి అనేది ముందు నుంచి ఉంది. గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరని రాజకీయ విశ్లేషకులు ఎప్పుడూ అంటుంటారు. అలాంటి పార్టీలో బలమైన నేతలకు సరైన గుర్తింపు ఉండదని అంటుంటారు. రేవంత్ వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. పలువురు సీనియర్లు అడ్డుకున్నారనే ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి రాకుండా పోయిందని అంటుంటారు. ఈ క్రమంలో అలాంటి పార్టీలో చేరితే మనుగడ కష్టమవుతుందని ఈటల భావిస్తున్నట్లు తెలిసింది.
ఇక ఇప్పటికిప్పుడు కొత్త పార్టీ పెడితే దాన్ని బూత్ స్థాయిలో బలపరచాలంటే అందుకు చాలా సమయం పడుతుంది. కనుక కొత్త పార్టీ ఆలోచన లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈటల ముందు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. బీజేపీ ఇప్పటికే తెలంగాణలో కొంత వరకు బలం పుంజుకుంది. మరోవైపు కేంద్రంలోనూ అధికారంలో ఉంది కనుక అందులో చేరితే ఈటలకు బలం చేకూరుతుంది, ఇంకో వైపు రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది. కనుక ఆయన అందులో చేరే అవకాశాలను కొట్టి పారేయలేమని విశ్లేషకులు అంటున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డితోపాటు ఇప్పటికే అందులో ఉండి ఎవరి సపోర్ట్ లేకుండా కాలం నెట్టుకొస్తున్న రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారని ఊహాగానాల వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజమవుతుందో చూడాలి.