సాధారణంగా మనదేశంలో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణ సమయంలో ఎటువంటి ఆలయాలు తెరచుకోవు. గ్రహణ సమయం పట్టడానికి కొన్ని గంటల ముందే ఆలయాలను మూసివేస్తారు.తరువాత గ్రహణం విడిచిన కొన్ని నిమిషాల తర్వాత ఆలయాలు తెరిచి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి తిరిగి పూజలు చేయడం ప్రారంభిస్తారు.కానీ మన దేశంలో ఏ ఆలయంలోనూ లేని విధంగా గ్రహణ సమయంలో ఆలయం తెరుచుకుని విశేష పూజలు జరుపుకొనే ఆలయం ఒకటి ఉందని మీకు తెలుసా? మరి ఆ ఆలయం ఏమిటి ఆ ఆలయ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి పట్టణం ఉంది. ఈ పట్టణంలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ప్రాచీనమైన ఆలయం ఉంది ఈ ఆలయంలో స్వామివారి స్వయంభూగా వెలిసి శ్రీకాళహస్తి ఈశ్వరుడిగా పూజలందుకుంటున్నారు. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు.పంచభూతలింగములలో నాల్గవదైన వాయులింగం గల గొప్ప శైవక్షేత్రం.
ఇక్కడ ఆలయంలో రెండు దీపాలతో ఒకటి ఎప్పుడు గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. మరొకటి ఎంతో నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది. ఈ విధంగా గాలికి దీపం రెపరెపలాడే దీపం ఈ ఆలయంలో వెలసిన స్వామి వారు వాయులింగం అని చెప్పడానికి నిదర్శనం అని చెప్పవచ్చు. దేశంలో ఏ ఆలయంలో లేనివిధంగా ఆలయంలో రాహుకేతువులు ఉండటం వల్ల గ్రహణ సమయంలో ఈ ఆలయంలో రాహుకేతువులకి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. అందుకోసమే గ్రహణ సమయంలో ఈ ఆలయాన్ని మూసి వేయరు.గ్రహణం తరువాత ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు.