మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలను దైవ సమానంగా భావిస్తారు. అలాంటి వృక్షాలలో రావి చెట్టు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. రావిచెట్టులో సాక్షాత్తు ఆ త్రిమూర్తులు ఉన్నారని భావిస్తారు. రావి చెట్టు వేర్లలో బ్రహ్మ, చెట్టు కాండంలో శివుడు, కొమ్మలలో నారాయణుడు కొలువై ఉంటాడని స్కందపురాణం తెలియజేస్తోంది. ఇంత పరమపవిత్రమైన రావి వృక్షాన్ని పూజించడం వల్ల శని బాధలు తొలగిపోతాయి.
చాలామంది పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ విధంగా పుత్రసంతానం కోసం ఎదురు చూసేవారు రావిచెట్టుకు ఎర్రని వస్త్రంలో ముడుపు కట్టడంవల్ల వారికి పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. రావి చెట్టు ఆకులకు పూజ చేయటం వల్ల దోషాల నుంచి విముక్తి పొందవచ్చు. రావి ఆకుల కాండం దేవుడి వైపు ఉంచి ఈ ఆకుల పై దీపం వెలిగించడం ద్వారా మనం అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయని పండితులు చెబుతున్నారు.
రావిచెట్టుకు ప్రతి శనివారం సాయంత్రం నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల మనపై ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఈతిబాధలు తొలగిపోయి మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. రావి చెట్టు దీపం వెలిగించడం ద్వారా కాలసర్ప దోషాలు సైతం తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.