ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్ల ఎక్కువయ్యారు. అమాయకులను ఆసరాగా చేసుకొని వారి దగ్గర నుంచి లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు. ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాలను సృష్టించి ప్రేమపేరుతో కొందరి అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. మరికొందరిని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తూ వారి దగ్గర లక్షల డబ్బులను లాగుతున్న ఓ కిలాడీ జంటను చివరికి పోలీసులు అరెస్టు చేసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
మహబూబ్‌నగర్ జిల్లా కోస్గికి చెందిన పొన్నం నవీన్‌కుమార్, భార్య శిరీషతో కలిసి లింగంపల్లిలో నివసిస్తున్నారు వీరికి మూడు నెలల వయసున్న పాప ఉంది. ఈ క్రమంలోనే నవీన్ కుమార్ ఒక మెడికల్ షాప్ లో క్యాషియర్ గా పని చేస్తున్నారు. అయితే అక్కడ వచ్చే జీతం సరిపడకపోవడంతో ఈ విధమైనటువంటి మోసాలకు తెరలేపారు.ఈ క్రమంలోనే శ్వేతా అనే పేరుతో ఫేస్ బుక్ లో ఒక నకిలీ ఖాతాను సృష్టించారు.యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించారు. నగరానికి చెందిన ఓ బాధితుడు వీరి వలలో చిక్కాడు. ఆదాయపు పన్నుల శాఖలో ఉద్యోగాలు ఉన్నాయని ఆ యువకుడికి మాయమాటలు చెప్పి సుమారు 8 లక్షల వరకు డబ్బులు లాగారు.
అదేవిధంగా ప్రేమ వల వేసి మరోక యువకుడి దగ్గర రూ.2.50 లక్షలు బదిలీ చేయించుకుంది. జూబ్లీహిల్స్‌కు చెందిన మరొకరిని మోసం చేసి రూ.2 లక్షల గుంజింది. ఈ విధంగా అందరి దగ్గర లక్షల్లో డబ్బులను లాగి ఉన్నఫలంగా ఫోన్ ఆఫ్ చేయడంతో బాధితులు హైదరాబాద్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా వారిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే వారిపై ఇదివరకే రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలోనూ కేసులున్నాయని తెలియడంతో పోలీసులు నవీన్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. అదేవిధంగా వీరికి మూడు నెలల పాప ఉండడంతో శిరీషకు పోలీసులు నోటీసు ఇచ్చి పంపారు.