వారిద్దరూ మతాలు వేరైనా మనసులు కలిశాయి. పెద్దలను ఎదిరించి 14 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఎంతో ఆనందంగా సాగిపోతున్న వీరి జీవితంలో మనస్పర్థలు తలెత్తాయి. దీంతో తన భర్త ప్రవర్తనతో విసిగి పోయిన భార్య ఏకంగా తన భర్త పట్ల ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రేమించిన భర్తనే దారుణంగా హత్య చేయించిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నెల్లూరులోని జాకీర్ హుస్సేన్ నగర్‌లో ఈ నెల 22వ తేదీ జరిగిన ఎలక్ట్రీషియన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు సంబంధించిన నిందితులను మంగళవారం నవాబుపేట పోలీస్ స్టేషన్‌లో విలేకరుల ఎదుట హాజరుపరచిన డీఎస్పీ జే శ్రీనివాసులు అసలు విషయం బయట పెట్టాడు.జాకీర్ హుస్సేన్ నగర్‌కు చెందిన ఫయాజ్ (33), కల్యాణి ప్రేమించుకుని 2007లో వివాహం చేసుకున్నారు. ఫయాజ్ ఎలక్ట్రిషన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడు.
అయితే ఈ మధ్య కాలంలో మద్యానికి బానిసైన ఫయాజ్ నిత్యం మందు తాగి భార్యతో గొడవలు పెట్టుకునేవాడు. దీంతో ఆర్థిక సమస్యలు అధికమవడంతో కళ్యాణి జాకీర్‌హుస్సేన్ నగర్‌కు చెందిన షేక్ అఫ్రోజ్ అలియాస్ కరిముల్లా వద్ద వడ్డీకి డబ్బులు అప్పుగా తీసుకుని పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ క్రమంలోనే తన భర్త వేధింపులు భరించలేక కరీముల్లాతో మాట్లాడి తన భర్తను చంపడానికి ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ఈనెల 22వ తేదీన మద్యం తాగి ఇంటికి చేరుకున్న ఫయాజ్ ను చంపాలని భావించారు. ఇదే విషయమే కరీముల్లాకు చెప్పి తను మార్కెట్ కు వెళ్లింది. ఈ క్రమంలోనే కరీముల్లా ఫయాజ్ ఇంటికి చేరుకొని అతనిపై దాడి చేసి అతనిని చంపినట్లు పోలీసులు తమ విచారణలో వెల్లడించారు.