మనదేశంలో వివాహ సమయంలో వరుడు కుటుంబ సభ్యులు వధువు కుటుంబం నుంచి కట్నం తీసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తూంది. ఈ వరకట్నం పై ఎన్ని చట్టాలు చేసిన ఇది మాత్రం ఆగడం లేదు. పెళ్లి సమయంలో ఇచ్చే వరకట్నం సరిపోక పెళ్లి తర్వాత ఎంతో మంది అదనపు కట్నం కోసం మహిళలను వేధిస్తోన్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటన మహారాష్ట్రలో ఒకటి చోటు చేసుకుంది. సరిగ్గా తాళికట్టే సమయానికి వరుడు కోరికలు ఒక్కొక్కటిగా బయట పెట్టాడు.. ఈ వరుడి వింత కోరికలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడికి ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. అయితే ముందుగా అనుకున్న ప్రకారం వరుడికి రెండు లక్షల నగదు, బంగారం పెళ్లికి ముందుగానే ఇచ్చారు. తీరా పెళ్లి సమయానికి వరుడు తనకు అదనపు కట్నం కావాలని అవి ఇస్తేనే తనను పెళ్లి చేసుకుంటాననే విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.
ఈ క్రమంలోనే వరుడు తనకు అదనపు కట్నంగా 10 లక్షలు కావాలనే డిమాండ్ చేయడమే కాకుండా, తనకు 21 తాబేలు, నల్ల కుక్క, బుద్ధుడి విగ్రహం, దీపపు కుందే ఇలా ఒక్కొక్కటిగా తన కోరికల చిట్టా విప్పారు. వరుడి వింత కోరికలు విన్న కుటుంబం షాక్ అయింది.ఈ క్రమంలోనే వరుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది.తనకు అదనపు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని జైలుకు తరలించారు.