వర్షం పడినప్పుడు మనం బయట ఉంటే మన ఫోన్లు, ఇతర వస్తువులు తడవకుండా మనం వాటిని కవర్లలో పెట్టుకుంటాం. అయితే కవర్లను మనం అన్ని సందర్భాల్లోనూ వెంట తీసుకెళ్లలేం కదా. దీంతో ఫోన్లు వర్షానికి తడిచిపోతుంటాయి. వాటర్ రెసిస్టెన్స్ ఉంటే ఏమీ కాదు. ఆ ఫీచర్ లేకపోతే.. ఫోన్ వర్షంలో తడిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఫోన్‌ను రిపేర్ కోసం సర్వీస్ సెంటర్‌లో ఇవ్వాల్సి ఉంటుంది.
అలా ఫోన్‌ను రిపేర్ కోసం ఇస్తే అందుకు అయ్యే ఖర్చులను భరించాలి. ఈ విధంగా వర్షంలో తడిచిన ఫోన్లతో అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కింద చెప్పబోయే సూచన పాటిస్తే దాంతో ఇకపై వర్షంలో ఎప్పుడు తడవాల్సి వచ్చినా మీరు తడుస్తారు.. కానీ ఫోన్ తడవదు. అందుకు ఏం చేయాలంటే..
సాధారణంగా మనం ఫోన్లను కొన్నప్పుడు వాటితోపాటు కవర్లను ఇస్తుంటారు. ఫోన్‌ను వాటిలో ఉంచి ప్యాక్ చేస్తారు. మనం బాక్స్ ను ఓపెన్ చేసి తీయగానే ఫోన్ కవర్‌లో ఉంటుంది. అయితే ఆ కవర్‌ను పారేయకండి. దాన్ని అలాగే దాచి పెట్టుకోండి.
ఫోన్‌కు చెందిన బ్యాక్ కేస్ లో వెనుక వైపు ఆ కవర్‌ను ఉంచి ఫోన్‌కు బ్యాక్ కేస్ ఫిక్స్ చేయండి. దీంతో ఆ కేస్‌లో కవర్ అలాగే ఉంటుంది. ఫోన్ ఆ కవర్‌లో పర్‌ఫెక్ట్‌గా ఫిట్ అవుతుంది. ఈ క్రమంలో మీరు ఎప్పుడైనా బయట ఉన్నప్పుడు వర్షం పడితే అప్పుడు ఆ కవర్‌ను బయటకు తీసి అందులో ఫోన్‌ను ఉంచి సీల్ వేసేయండి. ఫోన్ తడవకుండా ఉంటుంది. తరువాత ఆ కవర్‌ను తడి పోయేలా ఆరబెట్టండి. దీంతో కవర్ పొడిగా మారుతుంది. మళ్లీ దాన్ని బ్యాక్ కేస్ లో పెట్టుకోండి. ఈ విధంగా ఆ కవర్‌ను ఉపయోగించడం వల్ల వర్షంలో ఉన్నా కూడా ఫోన్‌ను తడవకుండా చూసుకోవచ్చు.