Gruha Jyothi Scheme : గతంలో మాదిరిగా కాకుండా ప్రజలకు నిజమైన సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రస్తుతం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తున్నాయి. మోసపూరిత హామీలను ఇస్తే ప్రజలు నమ్మడం లేదు. ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు. కనుక రాజకీయ పార్టీలు స్కీమ్‌లను ప్రకటించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మరీ స్కీమ్‌లను అందిస్తున్నాయి. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి అద్భుతమైన పథకాలను అందిస్తామని చెప్పి సీఎం అయ్యారు. అందులో గృహ జ్యోతి కూడా ఉంది.
ఈ పథకం కింద అర్హులైన పేదలకు ఉచితంగా గృహావసరాలకు కరెంటును అందిస్తారు. 200 యూనిట్లు అంతకన్నా తక్కువ విద్యుత్‌ను వాడుకునే పేదలు ఇందుకు అర్హులు. 2024 ఫిబ్రవరి 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రకటించింది. దీంతోపాటు రూ.500కే గ్యాస్ సిలిండర్‌ను కూడా అదే రోజు ప్రకటించారు. ఈ క్రమంలోనే అర్హులైన లబ్ధిదారులందరికీ మార్చి మొదటి వారం నుంచి సున్నా బిల్లులు వస్తున్నాయి. ఇక ఇందుకు గాను బిల్లింగ్ మెషిన్లలో ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను అమర్చారు.

కాగా ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తు, రేషన్ కార్డు ఆధారంగా అర్హులైన వారికి బిల్లింగ్ మెషిన్‌లో నుంచి ఆటోమేటిక్‌గా జీరో బిల్ వచ్చేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీంతో ఇప్పటికే చాలా మందికి జీరో బిల్స్ వస్తున్నాయి. అయితే గృహజ్యోతి పథకంపై వేసవి కాలం ప్రభావం పడింది. ఈ పథకానికి అర్హులైన వారిలో కొందరికి గృహజ్యోతి స్కీం కట్ అయింది. దీంతో వినియోగదారులు షాకవుతున్నారు. రూల్ ప్రకారం 200 యూనిట్లు లేదా అంతకన్నా తక్కువ కరెంటు వాడితేనే జీరో బిల్ వస్తుంది. 200 మీద ఒక్క యూనిల్ పెరిగినా సరే జీరో బిల్ రాదు, కరెంటు బిల్లు పూర్తిగా వస్తుంది, దాన్ని కట్టాల్సి ఉంటుంది.
అయితే మార్చి నెల వరకు బాగానే ఉన్నా ఆ తరువాత నుంచి ఎండలు ముదిరాయి కనుక ఫ్యాన్లు, కూలర్లను చాలా మంది వాడారు. దీంతో సహజంగానే కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చింది. ఫలితంగా వారు గృహజ్యోతి పథకానికి అనర్హులు అయ్యారు. 200 యూనిట్ల పైన విద్యుత్ వాడడంతో బిల్లు పూర్తిగా వచ్చింది. దీంతో ఏప్రిల్, మే నెలలకు బిల్లు వచ్చింది. జీరో బిల్ రాలేదు. ఫలితంగా పూర్తి బిల్లును కట్టాల్సి వస్తుంది. ఇది చూసిన వినియోగదారులు షాకవుతున్నారు. కానీ అధికారులు మాత్రం రూల్ ప్రకారమే బిల్ వచ్చిందని, 200 యూనిట్ల లోపు ఉంటేనే జీరో బిల్ వస్తుందని చెబుతున్నారు. ఏది ఏమైనా కొందరు లబ్ధిదారులకు ఈ పథకం కట్ అయిన కారణంగా వారు విచారంగా ఉన్నారని చెప్పవచ్చు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు బాగానే ఉంటాయి కానీ వాటిని ఆచి తూచి వాడాల్సి ఉంటుంది.