Footwear : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈమధ్యే పార్లమెంట్‌లో 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రతి ఏటా బడ్జెట్ వల్ల కొన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. మరికొన్ని వస్తువుల ధరలు మాత్రం తగ్గుతాయి. కానీ బడ్జెట్‌తో సంబంధం లేకుండానే ఈసారి ఫుట్‌వేర్ ధరలు మాత్రం పెరగనున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. ఇంతకీ అసలు విషయం ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ధరించే శాండల్స్, స్లిప్పర్స్, ఇతర చెప్పులతోపాటు షూస్ కూడా నిర్దిష్టమైన నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉంటాయి. బ్రాండెడ్ కంపెనీవి అయితే ఎక్కువ నాణ్యంగా ఉంటాయి. ఎక్కువ కాలం పాటు మన్నుతాయి. అయితే ఇకపై ఫుట్‌వేర్ తయారీదారులు కచ్చితంగా పలు నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సిందే. ఫుట్‌వేర్ తయారీలో ఉపయోగించే మెటీరియల్స్‌కు గాను తయారీదారులు ఐఎస్ 6721, ఐఎస్ 10702 ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రమాణాలతో తయారు చేసే ఫుట్‌వేర్ వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండాలి. అలాగే ఎక్కువకాలం పాటు మన్నాలి. ఇలా నాణ్యతను పాటిస్తూ ఏ ఫుట్‌వేర్‌ను అయినా సరే తయారు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) ఫుట్‌వేర్ తయారీదారులకు ఆదేశాలు జారీ చేసింది.

అయితే చిన్నపాటి చెప్పుల తయారీ పరిశ్రమలకు ఈ నియమం వర్తించదు. ఏడాదికి రూ.50 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ కలిగిన కంపెనీలు ఈ నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదు. అలాగే ఆగస్టు 1 వరకు ఉన్న స్టాక్‌కు కూడా ఈ నిబంధన వర్తించదు. కానీ ఆ స్టాక్ వివరాలను తయారీదారులు బీఐఎస్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
అయితే బీఐఎస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా వరకు బ్రాండ్లకు చెందిన ఫుట్‌వేర్ ధరలు పెరుగుతాయని అంటున్నారు. వినియోగదారులకు సౌకర్యవంతమైన, నాణ్యమైన ఫుట్‌వేర్‌ను అందించాలంటే అందుకు వాడే మెటీరియల్‌ను కాస్త ఖరీదైనది వాడాలి. దీంతో ఫుట్‌వేర్ ధరలను పెంచక తప్పదు. అయితే దీనిపై బీఐఎస్ స్పష్టతను ఇవ్వలేదు. కానీ ఫుట్‌వేర్ ధరలు మాత్రం కచ్చితంగా పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.