Currency : ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీ ఏదంటే.. ఎవరైనా సరే ఠక్కున అమెరికన్ డాలర్ అని చెబుతారు. అయితే వాస్తవానికి అమెరికా డాలర్ కన్నా ఇంకా బలమైన కరెన్సీలు ఉన్నాయి. అవి డాలర్ కన్నా కొన్ని రెట్లు ఎక్కువ విలువైనవి. ముఖ్యంగా అరబ్ దేశాల్లో కొన్ని డాలర్ కన్నా బలమైన కరెన్సీని కలిగి ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ ఏయే దేశాల్లో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
సౌదీ అరేబియా, ఇరాక్ దేశాల మధ్య ఉండే కువైట్ పేరు అందరికీ తెలిసిందే. ఇక్కడికి చాలా మంది వలస వెళ్తుంటారు. కువైట్‌లో కరెన్సీని దినార్‌లతో కొలుస్తారు. ఒక కువైట్ దినార్ విలువ 3.26 అమెరికన్ డాలర్లతో సమానం. భారత కరెన్సీ అయితే ఒక కువైట్ దినార్‌కు రూ.272 వస్తాయి. ప్రపంచంలో ప్రస్తుతం కువైట్ దినార్‌లనే అత్యంత బలమైన కరెన్సీగా చెప్పవచ్చు. బహ్రెయిన్ కరెన్సీ కూడా ప్రపంచంలో రెండో బలమైన కరెన్సీగా ఉంది. ఇక్కడ కూడా దినార్‌లలోనే కొలుస్తారు. ఒక బహ్రెయిన్ దినార్‌కు 2.65 అమెరికన్ డాలర్లు వస్తాయి. అదే భారత కరెన్సీ అయితే రూ.222 వస్తాయి. ఇక కువైట్, బహ్రెయిన్ దేశాలు క్రూడాయిల్‌ను ఎగుమతి చేస్తాయి. అందుకనే వాటి కరెన్సీకి విలువ ఎక్కువ.

కువైట్, బహ్రెయిన్ తరువాత బలమైన కరెన్సీని కలిగిన దేశాల్లో ఒమన్ మూడో స్థానంలో ఉంది. ఇక్కడి కరెన్సీని రియాల్‌గా వ్యవహరిస్తారు. ఒక ఒమన్ రియాల్‌కు 2.59 అమెరికన్ డాలర్లు వస్తాయి. రూ.216 భారత కరెన్సీ వస్తుంది. ఈ దేశ ఆదాయ వనరు కూడా ముడి చమురు సరఫరానే కావడం విశేషం. ఇక తరువాతి స్థానంలో జోర్డాన్ ఉంది. ఈ దేశ కరెన్సీని కూడా దినార్‌లుగానే వ్యవహరిస్తారు. ఒక జోర్డాన్ దినార్‌కు 1.41 అమెరికన్ డాలర్లు వస్తాయి. భారత కరెన్సీలో అయితే రూ.117 వస్తాయి.
ఇక బ్రిటిష్ పౌండ్, జిబ్రాల్టర్ పౌండ్, సీమన్ ఐల్యాండ్ డాలర్, స్విస్ ఫ్రాంక్, యూరో కూడా అమెరికన్ డాలర్ కన్నా బలమైన కరెన్సీలే. కాగా ప్రపంచంలో బలమైన కరెన్సీని కలిగిన దేశాల్లో అమెరికన్ డాలర్ 10వ స్థానంలో ఉంది.