అబుధాబి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2021 టోర్నీ 31వ మ్యాచ్ లో కోల్‌కతా ఘన విజయం సాధించింది. పటిష్టమైన బౌలింగ్‌తో కోల్‌కతా జట్టు బెంగళూరును చాలా స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. దీంతో కోల్‌కతా లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. బెంగళూరు నిర్దేశించిన 93 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా అలవోకగా సాధించింది. దీంతో బెంగళూరుపై కోల్‌కతా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లు కూడా ఆడలేదు. 19 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌట్ అయింది. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లే వెనక్కి వెళ్లారు. ఆ జట్టులో పడిక్కల్ మినహా ఎవరూ రాణించలేదు. పడిక్కల్ కూడా కేవలం 22 పరుగులే చేశాడు. ఇక కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్, వరుణ్ చక్రవర్తిలు చెరో 3 వికెట్లను పడగొట్టగా, ప్రసిధ్ కృష్ణ కు 1 వికెట్ దక్కింది. లాకీ ఫెర్గుసన్ 2 వికెట్లు తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 1 వికెట్ మాత్రమే కోల్పోయి 94 పరుగులు చేసింది. ఓపెనర్లు చక్కగా రాణించారు. శుబమన్ గిల్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 48 పరుగులు చేయగా, మరో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో చాహల్ ఒక వికెట్ తీశాడు.