ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 12వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. చెన్నై విసిరిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ తడబడింది. పలువురు బ్యాట్స్‌మెన్ పరుగులు రాబట్టేందుకు యత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాజస్థాన్‌పై చెన్నై 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో డుప్లెసిస్, అంబటి రాయుడులు రాణించారు. 17 బంతులు ఆడిన డుప్లెసిస్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేయగా, రాయుడు 17 బంతుల్లో 3 సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ శకారియా 3 వికెట్లు పడగొట్టాడు. క్రిస్ మోరిస్ 2 వికెట్లు తీశాడు. ముస్తాఫిజుర్ రహమాన్, రాహుల్ తెవాతియాలకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో జాస్ బట్లర్ మినహా ఎవరూ రాణించలేదు. 35 బంతులు ఆడిన బట్లర్ 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో మోయిన్ అలీ 3 వికెట్లు పడగొట్టగా, శామ్ కుర్రాన్, రవీంద్ర జడేజాలు చెరో 2 వికెట్ల చొప్పున తీశారు. శార్దూల్ ఠాకూర్, బ్రేవోలకు చెరొక వికెట్ దక్కింది.