Badvel : బద్వేలులో వార్ వన్‌సైడే అయింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో దూసుకుపోయింది. సమీప బీజేపీ అభ్యర్థి దరిదాపుల్లో కూడా లేరు. దీంతో వైసీపీ విజయం సాధించింది. అన్ని రౌండ్లలోనూ వైసీపీ భారీ మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగింది. చివరకు వైసీపీ గెలుపొందింది. మొత్తానికి ఉప ఎన్నికలో ప్రజలు మరోసారి వైసీపీకే పట్టం కట్టారు. బద్వేలు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు.
బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ భారీ మెజారిటీతో విజయం సాధించారు. 90,089 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. వైసీపీకి మొత్తం 1,11,710 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 21,612 ఓట్లు మాత్రమే వచ్చాయి. బద్వేల్‌లో మొత్తం 1,46,546 ఓట్లు పోలయ్యాయి. ఇక కాంగ్రెస్‌కు 6,205 ఓట్లు మాత్రమే వచ్చాయి.
బద్వేలు ఉప ఎన్నికలో నోటాకు 3,635 ఓట్లు రాగా, 90,089 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు. కాగా 2019 ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గంలో 77.64 శాతం పోలింగ్ నమోదైంది. అప్పట్లో 2,04,618 ఓట్లు ఉండగా, 1,58,863 ఓట్లు పోలయ్యాయి. 2019లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య నిలబడగా.. ఆయన 44,734 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఇప్పుడాయన భార్య డాక్టర్ సుధకు అంతకు రెట్టింపు మెజారిటీ రావడం విశేషం.
బద్వేల్‌లో గెలుపులో ఏపీలో ఎక్కడ చూసినా వైసీపీ సంబురాలు చేసుకుంటోంది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటున్నారు.