Viral Video : ఫోన్‌లో మాట్లాడుతూ రహదారిపై నడిచి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొనవచ్చు. లేదా ఇంకేదైనా ప్రమాదం జరగవచ్చు. అయితే ఇలాంటి ప్రమాదాన్ని ఆమె ఊహించలేదు. ఈ క్రమంలోనే ఆమె రహదారిపై నడుచుకుంటూ వెళ్తూ ఫోన్‌లో మాట్లాడుతూ అలాగే ముందుకు వెళ్లింది. తరువాత అక్కడే ఉన్న మ్యాన్‌హోల్‌లో దురదృష్టవశాత్తూ పడిపోయింది. అయితే రద్దీగా ఉన్న ప్రదేశం కనుక వెంటనే ఆమెను రక్షించారు. లేదంటే ఆమె ప్రాణాలు కోల్పోయి ఉండేది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

బీహార్ లోని పాట్నాలో ఉన్న 56వ వార్డులోని మాలియా మహాదేవ్ జల్లా అనే పేరున్న రోడ్డులో ఓ మహిళ ఫోన్‌లో మాట్లాడుతూ రహదారిపై నడుచుకుంటూ వెళ్తోంది. అయితే ఆమె ముందు ఓ ఇ-రిక్షా ఉంది. దీంతో ఆ రిక్షా వెళ్లగానే దాని వెనుకే ఆమె రోడ్డు మీద ముందుకు వెళ్లింది. అయితే ఆమె ఫోన్‌లో మాట్లాడుతున్న కారణంగా కిందకు చూడలేదు. దిక్కులు చూస్తూ ముందుకు నడిచింది. దీంతో అక్కడే తెరిచి ఉన్న ఓ మ్యాన్‌హోల్‌లో ఆమె పడిపోయింది.
Watch: A woman falls into an open manhole in Patna on Friday. This comes a day after a toddler died after falling into a borewell in the capital. pic.twitter.com/PHvCYYMWKF
— TOI Patna (@TOIPatna) April 22, 2022
అయితే ఆమె అలా మ్యాన్‌హోల్‌లో పడగానే చుట్టూ ఉన్న కొందరు వెంటనే పరిగెత్తుకుని వచ్చారు. హుటాహుటిన ఆమెను బయటకు లాగారు. తరువాత ఆమె పక్కనే ఉండి వ్యర్థాలను శుభ్రం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ మ్యాన్‌హోల్‌లో ఎవరూ పడకుండా అక్కడి వారు దానిపై మూత పెట్టి కవర్ చేశారు. ఇక అదే సమయంలో అక్కడ ఉన్న సీసీకెమెరాల్లో ఈ సంఘటన రికార్డు అయింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా అక్కడ ఇటీవల మ్యాన్‌హోల్ పనులు చేశారని.. కానీ మూత పెట్టలేదని.. పాట్నాలో ఇలా అనేక చోట్ల ఉన్నాయని.. తాము ఫిర్యాదు చేసినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని.. స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.