Whatsapp : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. వాట్సాప్‌లో పలు నూతన ఫీచర్లను అందివ్వనున్నట్లు తెలియజేసింది. ఇప్పటికే ఎన్నో సౌకర్యవంతమైన ఫీచర్లను వాట్సాప్ అందజేయగా.. త్వరలో మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు వాట్సాప్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది.

వాట్సాప్‌లో ఇకపై యూజర్లు రిప్లై ఇవ్వాలనుకుంటే అందుకు ఎమోజీ రియాక్షన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌ను కొత్తగా అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే గ్రూప్‌లో ఉన్న మెంబర్లు ఏవైనా అనుచిత మెసేజ్‌లు పెడితే.. వాటిని అడ్మిన్లు ఎప్పుడైనా డిలీట్ చేయవచ్చు. దీంతో గ్రూప్‌లో సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుంది.
ఇక వాట్సాప్‌లో ఫైల్ షేరింగ్ కెపాసిటీని కూడా పెంచారు. ఇప్పటి వరకు కేవలం 25 ఎంబీ సైజ్‌లో మాత్రమే ఫైల్స్‌ను పంపుకునే వీలుండేది. కానీ ఇకపై 2జీబీ వరకు సైజ్ ఉన్న ఫైల్స్‌ను కూడా వాట్సాప్‌లో షేర్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాజెక్ట్‌లు చేసే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. భారీ సైజ్ ఉన్న ఫైల్స్ అయినా సరే.. ఇకపై వాట్సాప్‌లో పంపుకోవచ్చు.
ఇక వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను ఏక కాలంలో 32 మందితో కలిసి ఉపయోగించుకోవచ్చు. దీంతో గ్రూప్ కాల్స్ చేయడం మరింత సులభతరం అవుతుంది. అయితే ఈ ఫీచర్లన్నీ ఇప్పటికే వాట్సాప్ బీటా వెర్షన్‌లో లభిస్తుండగా.. అతి త్వరలోనే ఇతర వాట్సాప్ యూజర్లందరికీ ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు వాట్సాప్ ఒక ప్రకటనలో తెలియజేసింది.