Virata Parvam : దగ్గుబాటి రానా, సాయి పల్లవిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ.. విరాటపర్వం. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమాను మొదట జూలైలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ఈ సినిమా విడుదలను కాస్త ముందుకు జరిపారు. దీంతో జూన్ 17వ తేదీన ఈ సినిమాను ఎట్టకేలకు విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీకి చెందిన ట్రైలర్‌ను అట్టహాసంగా కొద్ది సేపటి క్రితమే లాంచ్ చేశారు. కర్నూల్‌లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే విరాట పర్వం అని పేరుకే కానీ ట్రైలర్‌ను చూస్తే మాత్రం భిన్నంగా ఉంది. ఆద్యంతం ప్రేక్షకులకు థ్రిల్‌ను కలిగించేలా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దీంతో సినిమాలోనూ ఇలాగే కథ ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఈ మూవీలో దగ్గుబాటి రానా.. రవన్న పాత్రలో కనిపించనున్నారు. సాయిపల్లవి వెన్నెలగా నటించింది. 1990లలో తెలంగాణలో ఉన్న నక్సల్స్ ఉద్యమం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అప్పట్లో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలపై ప్రభుత్వాలు, నాయకులు కొనసాగించిన నిరంకుశ పాలన, అణచివేత ధోరణి, వివక్షత వంటి అంశాలపై గళమెత్తి.. పోరాటం చేసే నక్సల్ నాయకుడిగా రవన్న కనిపిస్తాడు. ఇక అతని జీవితంలో అన్ని విషయాల్లోనూ పాలు పంచుకుని అతనితో కలిసి పోరాటం చేసే యువతిగా వెన్నెల కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కథను బట్టి చూస్తే ప్రేక్షకులను తప్పక అలరిస్తుందని తెలుస్తోంది.

ఇక ఈ మూవీకి డాని శాంచెజ్ లోపెజ్, దివాకర్ మణిలు సినిమాటోగ్రఫీ బాధ్యతలను వహించారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. ఇందులో రానా, సాయిపల్లవితోపాటు ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరీ రావు, సాయిచంద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించగా.. నిర్మాత డి.సురేష్ బాబు సమర్పిస్తున్నారు.