Virat Kohli : భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే సహజంగానే ఇరు దేశాలకు చెందిన క్రికెట్ ప్రేమికుల్లో ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఇక అదే మ్యాచ్ ఉత్కంఠగా సాగితే.. అంతకు మించిన మజా ఏముంటుంది. ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కూడా సరిగ్గా ఇలాగే ఉత్కంఠగా సాగింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లుగా పోరు జరిగింది. అయితే కోహ్లి వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా భారత్ ఈ మ్యాచ్‌లో గెలుపొందింది. తన ఖాతాలో ఘన విజయాన్ని నమోదు చేసింది. కీలక దశలో ఉన్న జట్టును కోహ్లి, పాండ్యాలు ఆదుకున్నారు.
34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి మ్యాచ్ ఓడిపోతుందనుకున్న దశలో కోహ్లి, పాండ్యా ఆచి తూచి ఆడారు. అవకాశం చిక్కినప్పుడల్లా పరుగులను పిండుకున్నారు. దీంతో అభిమానులకు మళ్లీ మ్యాచ్‌పై ఆశలు చిగురించాయి. ఇక చివరి ఓవర్ల వరకు అలాగే సాగింది. చివర్లో పాకిస్థాన్ చేసిన తప్పులకు తోడు.. కోహ్లి సిక్స్‌లతో విజృంభించాడు. దీంతో చివరి బంతికి గెలుపు ఖాయమైంది. అశ్విన్ విన్నింగ్ షాట్ ఆడాడు. దీంతో అంతటా సంబరాలు నెలకొన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆడిన తీరు అమోఘం.

53 బంతులు ఆడిన కోహ్లి 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 160 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే భారత్‌కు విజయాన్ని కట్టబెట్టిన కోహ్లిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అతను క్రికెట్ రాజు అని వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కోహ్లిపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. కోహ్లి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.