Vijaya Shanti : చిన్నవయసులోనే వెండితెరంగేట్రం చేసిన నటి విజయశాంతి. గ్లామరస్ పాత్రలతో మొదలై.. లేడీ ఓరియంటెడ్ పాత్రలకే వన్నెతెచ్చిన హీరోయిన్. ఇండియన్ సినిమా హిస్టరీలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక నటి. నేటి భారతం తర్వాత విజయశాంతి ప్రస్థానం ప్రతి హీరోయిన్ కుళ్లుకునేలా సాగిందంటే అతిశయోక్తి కాదు. అప్పటి హీరోయిన్లంతా కేవలం గ్లామర్ కే పరిమితమైతే అటు గ్లామర్ ను, ఇటు పర్ఫార్మెన్స్ ను చూపించి ఆల్ రౌండర్ అనిపించుకుంది. ఓసేయ్ రాములమ్మా తెలుగు రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపేసి.. అప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులన్నీ బద్దలు కొట్టింది. సినిమాలకు గుడ్ బై చెప్పాక రాములమ్మ రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తుంది.
ఇందులో భాగంగానే టీఆర్ఎస్ లో చేరి ఉద్యమం చేసినా అందులో ఎక్కువ కాలం ఉండలేదు. తరువాత కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీలో చేరింది. ప్రజాసేవ చేయడమే తన ఉద్దేశమని చెబుతోంది. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. దాని కోసం భారీ పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. రాజకీయాల్లో ప్రజాసేవ చేయడమే బాగుంటుందని తన మనసులోని మాట వెల్లడించింది. ఇక అప్పటి హీరోల గురించి చెప్పమని ఓ విలేకరి ప్రశ్నించగా.. అందరూ దొంగలే అని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

ఆ హీరోలు సంపాదిస్తున్న దాంట్లో కనీసం 20 శాతం కూడా ప్రజల కోసం ఖర్చు చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు కనీసం ప్రజాసేవలో ఉన్న తనకు ఒక దండ కూడా వేయడానికి వారికి సమయం లేదా అని ప్రశ్నించింది. తాను తలుచుకుంటే కేంద్రమంత్రిని అయ్యేదానినే కానీ ప్రజాసేవ చేయడానికి పదవులు అవసరం లేదనే ఉద్దేశంతోనే కార్యకర్తగా మిగిలిపోతున్నాను. రాజకీయాల్లో పదవులు సాధించడం పెద్ద విషయమేమీ కాదు. సినిమాల విషయంలో ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేసి చులకన కావడం ఇష్టం లేదని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది రాములమ్మ.