Varsham Movie : టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ పేరుతో ఒకప్పటి హిట్ సినిమాల స్పెషల్ షోలు ప్రదర్శించే ట్రెండ్ నడుస్తుంది. రీసెంట్ గా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల బర్త్ డేల సందర్భంగా పోకిరి, జల్సా సినిమాల స్పెషల్ షోలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అభిమానుల నుండి కూడా విశేష స్పందన రావడం జరిగింది. ఇప్పుడు మరొక సినిమా కూడా ఇదే విధంగా ట్రెండ్ ఫాలో అవుతూ రీ రిలీజ్ కాబోతుంది. అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా ఆయన హీరోగా చేసిన ఒకప్పటి బ్లాక్ బస్టర్ అయిన వర్షం మూవీని అక్టోబర్ 22న రీ రిలీజ్ చేయనున్నారు.
4కె అల్ట్రా హెచ్‌డీ వెర్షన్ లో ఆంధ్ర, తెలంగాణలోని పలు థియేటర్లలో అక్టోబర్ 22 , 23 తేదీల్లో ప్రదర్శించనున్నారు. మాస్ డైరెక్టర్ శోభన్ దర్శకత్వంలో ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లుగా చేసిన ఈ సినిమాలో గోపీచంద్ నెగెటివ్ రోల్ లో నటించాడు. ప్రకాష్ రాజ్, సునీల్, జయ ప్రకాష్ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అప్పటి స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు వర్షం చిత్రాన్ని నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది.

ఈ సినిమాతోనే ప్రభాస్ కి స్టార్‌డమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. చిత్ర నిర్మాత ఎమ్మెస్ రాజు అభిమానులను అలరించడానికి ఏపీ తెలంగాణాల్లో చాలా థియేటర్లలో 4కె క్వాలిటీతో ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్టు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. అక్టోబర్ 22, 23 తేదీల్లో స్పెషల్ షోలు వేయనున్నట్టుగా చెబుతూ రెబల్ స్టార్ అభిమానులు సంబరాలు చేసుకోండని అన్నారు. దీంతో వారందరూ తమ సంతోషాన్ని తెలుపుతూ సినిమాతోపాటు ప్రభాస్ పుట్టిన రోజుని ఘనంగా జరుపుకోవాలని ఎదురుచూస్తున్నారు.