Liger Movie : లైగర్ సినిమా టైటిల్ ప్రకటించడం మొదలు ట్రైలర్ విడుదల వరకూ ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. పూరీ జగన్నాథ్ లాంటి ఒక సంచలన దర్శకుడు అలాగే విజయ్ దేవరకొండ లాంటి ఒక దూకుడుగా ఉండే హీరో కలిస్తే సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అనే దానికి ఈ చిత్రం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. వీరిద్దరూ మొదటి సారిగా లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఆటగాడి క్యారెక్టర్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాలో ప్రేక్షకులను విస్మయానికి గురిచేసే అంశాలు చాలా ఉన్నాయని తెలుస్తోంది. అయితే తాజాగా మూవీ ప్రమోషన్ లో భాగంగా జరిగిన ఒక మీడియా సమావేశంలో ఈ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఆయన ఈ సినిమా స్టోరీ గురించి చెబుతూ.. దీనిలో కీలక పాత్రను పోషిస్తున్న విజయ్ క్యారెక్టర్ పేరు లైగర్ అని చెప్పడం జరిగింది. అయితే అది సినిమాలో అతని తల్లిదండ్రుల పేర్లు కలిసేలా ఉండొచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోది కరీంనగర్ ప్రాంతం కాగా.. దేశంలోనే గొప్ప ఫైటర్ గా ఎదగడం అతని ఆశయం. అందుకోసం అతను తన తల్లితో కలిసి ముంబయి వెళతాడు. అక్కడ బాగా ధనవంతురాలైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇండియాలో గొప్ప పేరు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత అతను అమెరికా వెళ్లడం జరుగుతుంది. అక్కడ అతని జీవితంలోకి మైక్ టైసన్ ప్రవేశిస్తాడు. ఇక ఈ కథకి, మైక్ టైసన్ కి ఉన్న సంబంధం ఏమిటనేది తెరపైనే చూడాలి. ఈ క్రమంలోనే ఈ కథ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.