30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో ఎంతో పేరు సంపాదించుకున్న నటుడు.. పృథ్వి. ఖడ్గం సినిమాలో ఆయన చెప్పిన ఈ డైలాగ్ ని తెలుగులో ఎంతో మంది నటులు కూడా అనుకరించి కామెడీని పండించేవారంటే అతిశయోక్తి కాదు. అయితే 2019 లో ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లకి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీ ఎన్నికల్లో గెలవడంతో పృథ్వికి పార్టీ మీద ఉన్న అభిమానాన్ని చూసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి చైర్మన్ గా నియమించారు.
కానీ ఆయన ఆ పదవి చేపట్టిన కొద్ది రోజులకే.. మహిళలతో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినట్లుగా ఉన్న ఓ ఆడియో కాల్ రికార్డింగ్ బయటకు రావడంతో ఆయన ఆ పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అంతకు ముందు కూడా ఆయన పార్టీలో ఉన్నప్పుడు నోరు జారి మాట్లాడటం, పవన్ కల్యాణ్‌ని, ఆయన అభిమానులను, మెగా ఫ్యామిలీని తీవ్రంగా విమర్శించడం వల్ల ఆయన సినీ కెరీర్ లో పూర్తిగా అవకాశాలు రావడం కూడా తగ్గిపోయాయి. దీంతో ఆయన కెరీర్ కే ప్రమాదం వచ్చి పడింది.
కానీ ఈ మధ్య ఈయన నటుడు నాగబాబుని కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. దీంతో పృథ్వికి మళ్లీ సినిమా అవకాశాలు రావడం ప్రారంభమైంది. మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండడం వల్ల ఆ రిలేషన్ తనకు సినిమా ఛాన్సులను తెచ్చి పెడుతుందని పృథ్వి అనుకుంటున్నారట. దీంతో ఇబ్బందుల్లో ఉన్న తన మూవీ కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందని పృథ్వి నమ్ముతున్నారని టాక్ నడుస్తోంది. ఇందుకోసమే ఆయన జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
కానీ పృథ్వి జనసేన పార్టీలో చేరడం వల్ల ఆ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతారో చూడాలి. లైంగిక వేధింపుల ఆరోపణలతో మంచి పేరు, సినీ కెరీర్, పదవి పోగొట్టుకున్న ఆయనని పార్టీలో చేర్చుకోవడం వల్ల విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని.. జనసేన అభిమానులు వ్యతిరేకిస్తున్నారట. దీంతో పృథ్వి జనసేనలో చేరడం కొందరికి నచ్చడం లేదని తెలుస్తోంది. అయితే జనసేనలో చేరాక పృథ్వి ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.