Rs 200 Notes : కేంద్రంలో మోదీ ప్రభుత్వం చాలా ఏళ్ల కిందట రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన విషయం విదితమే. నకిలీ నోట్లు, అవినీతి తదితర కారణాల వల్ల పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని అప్పటి ప్రభుత్వం తెలియజేసింది. అయితే నిజానికి నకిలీ నోట్లు రావడం కొత్తేమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ సమస్య కేవలం మన దేశంలోనే కాదు, అమెరికా వంటి అగ్రదేశాలను కూడా ఇబ్బందులకు గురి చేస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సమస్య మనకు రూ.200 నోట్ల రూపంలో వచ్చింది. అవును, పలు చోట్ల రూ.200 నకిలీ నోట్లు చెలామణీ అవుతున్నట్లు గుర్తించారు.
వనపర్తి జిల్లాలో ఈ మధ్యకాలంలో రూ.200కు చెందిన నకిలీ నోట్ల చెలామణీ ఎక్కువైపోయింది. అక్కడ ఈ నోట్లను బాగా చెలామణీ చేస్తున్నారట. ఇవి అచ్చు గుద్దినట్లు ఒరిజినల్ నోట్లను పోలి ఉంటున్నాయట. దీంతో గుర్తించడం కష్టమవుతుందట. ఈ క్రమంలో నకిలీ నోట్లను తీసుకున్న వారు తమకు వచ్చినవి నకిలీవి అని తెలిసి వాపోతున్నారు. అసలు ఈ నోట్లను ఎలా చెలామణీ చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో రూ.500, రూ.1000 ఆ తరువాత వచ్చిన రూ.500, రూ.2000 నోట్లను కూడా నకిలీవి ప్రింట్ చేసి చెలామణీ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు రూ.200 నోట్లను కూడా చెలామణీ చేస్తున్నారని తెలుస్తుండడంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఏది ఏమైనా మీరు రూ.200 నోట్లను తీసుకుంటున్నట్లయితే జాగ్రత్త. వాటిని పరిశీలించి తీసుకోండి. లేదంటే ఇబ్బందులు పడతారు.