ఖమ్మం జిల్లాలోని వేంసూరులో ఓ వ్యక్తి మృతదేహం పట్ల అమానుష ఘటన చోటుచేసుకుంది. వేంసూరులో అంబేద్కర్ కాలనీలో ఓ వ్యక్తి మరణించడంతో అతని దహన సంస్కారాలను కాలనీ సమీపంలోనే ఏర్పాటుచేయడంతో అసలు గొడవ మొదలైంది. ఇలా నివాస స్థలాలకు దగ్గరగా దహనసంస్కారాలు నిర్వహించడం వల్ల స్థానికంగా ఉండే ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా.. దహన సంస్కారాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వైకుంఠ ధామాన్ని నిర్మించింది.
ఇలా ప్రభుత్వం ప్రత్యేకంగా వైకుంఠధామాన్ని నిర్మించడంతో అప్పటినుంచి మరణించిన వారి మృతదేహాలకు అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తాజాగా గురువారం అంబేద్కర్ కాలనీలో ఓ వ్యక్తి మరణించడంతో అతని కుటుంబ సభ్యులు అతనికి దహన సంస్కారాలు చేయడం కోసం కాలనీ సమీపంలోనే ఏర్పాట్లు చేయడంతో కాలనీవాసులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ అంత్యక్రియలను అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఏకంగా ముందుగా దహన సంస్కారాల కోసం ఏర్పాటు చేసిన చితిపై ఎక్కి తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. ఈ విధంగా కొంత సమయం పాటు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మృతుడి బంధువులలో ఒకరు నచ్చ చెప్పగా చివరికి అంత్యక్రియలను నిర్వహించారు.