T20 World Cup 2021 : అబుధాబిలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ 33వ మ్యాచ్‌లో ఆఫ్గనిస్థాన్‌పై భారత్ గెలుపొందింది. వరల్డ్ కప్ టోర్నీలో ఎట్టకేలకు భారత్ బోణీ కొట్టింది. భారత్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఫ్గనిస్థాన్ ఛేదించలేకపోయింది. ఈ క్రమంలో ఆఫ్గనిస్థాన్‌పై భారత్ 66 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్గనిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ 74 పరుగులు, కేఎల్ రాహుల్ 69, హార్ధిక్ పాండ్యా 35 పరుగులతో రాణించారు. ఆఫ్గన్ బౌలర్లలో గుల్బదీన్ నయీబ్, కరీం జనత్‌లు చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఫ్గన్ బ్యాట్స్‌మెన్‌లలో కరీం జనత్ 42 పరుగులు, మహమ్మద్ నబీ 35 పరుగులు చేసి రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీశాడు. జస్‌ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజాలకు చెరొక వికెట్ దక్కింది.
అయితే ఈ మ్యాచ్‌లో గెలిచినప్పటికీ భారత్‌కు సెమీస్ అవకాశాలు లేవు. ఇకపై పాక్, కివీస్‌లకు చిన్న జట్లతో మ్యాచ్ లు ఉన్నాయి. ఆ మ్యాచ్‌లలో ఎలాగూ వారు ఓడిపోరు. కనుక భారత్ సెమీస్‌కు వెళ్లదనే చెప్పాలి. కానీ ఎంతో ఒత్తిడితో ఉన్న భారత్‌కు ఈ విజయం కాస్తంత ఊరటను ఇచ్చిందని చెప్పవచ్చు.