Siddharth : సినీ నటుడు సిద్ధార్థ.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులే కాదు.. మొత్తం సౌత్, నార్త్ ప్రేక్షకులు అందరూ ఎప్పుడో మరిచిపోయారు. కారణాలు ఏమున్నప్పటికీ ఈయన సినీ తెరకు దూరమై చాలా రోజులే అవుతోంది. మొన్నీ మధ్య ఏదో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ మూవీ వచ్చినట్లే చాలా మందికి తెలియదు. అయితే దక్షిణాదికి చెందిన చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలుస్తుంటే.. అవన్నీ పాన్ ఇండియా మూవీలు కాదని.. వాటిని ప్రాంతీయ భాషల పేరిట లేదా ఇండియన్ సినిమాలుగా పిలవాలని కొత్త అర్థం చెబుతున్నాడు.
అసలే ఆఫర్లు లేక.. వచ్చిన ఆ ఒక్కటి.. అరా ఆఫర్లను కూడా సద్వినియోగం చేసుకోలేక సిద్ధార్థ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్లు అర్థమవుతోంది. తాను నటించిన ఎస్కేపీ లివ్ అనే మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 21వ తేదీన విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సిద్ధార్థ్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్లు అతని ముఖాన్ని చూస్తేనే తెలుస్తుంది. అసలే ఆఫర్లు లేక.. వచ్చిన సినిమాలు కూడా హిట్స్ పడక.. తీవ్ర విచారంలో ఉండి అతను పాన్ ఇండియా మూవీలపై వ్యాఖ్యలు చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. మొన్నీ మధ్యే పాన్ ఇండియా అంటే అర్థం ఏంటి ? అని అడిగాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యాఖ్యలు చేశాడు.

దక్షిణాది సినిమాలను పాన్ ఇండియా సినిమాలు అని ఎలా అంటాం.. అని సిద్ధార్థ్ ప్రశ్నించాడు. వాటిని ప్రాంతీయ భాషల పేరిట.. అంటే ఉదాహరణకు కేజీఎఫ్ 2ను తీసుకుంటే అది కన్నడ భాష కాబట్టి.. పిలిస్తే కన్నడ సినిమా అనాలని.. లేదంటే ఇండియన్ సినిమా అనాలని.. పాన్ ఇండియా అంటే దేశానికి అమర్యాద ఇచ్చినట్లు అవుతుందని సెలవిచ్చాడు. వాస్తవానికి పాన్ ఇండియా, ఇండియన్ సినిమా అనే పదాలు వేర్వేరని సిద్ధార్థ్ అర్థం చేసుకోవాలి.
ఒక భాషలో తెరకెక్కించిన సినిమా దేశంలోని అన్ని భాషలు లేదా కొన్ని భాషల్లో రిలీజ్ అయితే అది పాన్ ఇండియా సినిమా అన్నట్లే లెక్క. అంటే ఇండియా లెవల్‌లో రిలీజ్ అయిందని అర్థం. ఇక మన దేశంలో ఏదైనా భాషలో తెరకెక్కిన సినిమా గురించి బయటి దేశీయులకు చెప్పినా.. లేదంటే వారు దాని గురించి మాట్లాడుకున్నా.. అప్పుడు ఇండియన్ సినిమా అంటారు. ఈ చిన్న సింపుల్ లాజిక్ కూడా తెలియకుండా పాన్ ఇండియా మూవీలు అని పిలవద్దని సిదార్థ్ అంటున్నాడంటే.. అతని జ్ఞానం ఏ మేర ఉందో ఇట్టే అర్థమవుతోంది. తోటి దక్షిణాది హీరోలు ఎదుగుతుంటే తాను ఇంకా పాతాళంలోనే ఎందుకు ఉన్నానా.. ఇంకా మళ్లీ హిట్ ఎప్పుడు కొట్టి మళ్లీ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తానా.. అనే ఫ్రస్ట్రేషన్‌లోనే తోటి హీరోల సినిమాలపై ఇలా అతను కామెంట్లు చేస్తున్నాడని స్పష్టమవుతోంది. ఇదిలాగే కొనసాగితే వచ్చే ఆ అవకాశాలు కూడా రావు. కనుక ఏవైనా వ్యాఖ్యలు చేసే ముందు కాస్త ఆలోచించి చేస్తే మంచిది..!