Shiva Shankar Master : కరోనా మహమ్మారి ఎందరో జీవితాలని చిన్నాభిన్నం చేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారికి సెలబ్స్ కూడా కన్నుమూశారు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కరోనా సోకడంతో గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు.
శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుక్కి కూడా కరోనా సోకగా.. ఆయన పరిస్థితి కూడా సీరియస్‌గానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇక శివ శంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకగా.. ఆమె హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. శివశంకర్ మాస్టార్ ఆసుపత్రి ఖర్చు రోజుకి లక్షలలో అవుతుందని ఆయన తనయుడు అంటున్నాడు.
వైద్యం కోసం ఎవరైనా సాయం చేయాలని కోరుతున్నాడు. ఎన్నో గొప్ప పాటలకు నృత్యాలను సమకూర్చి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శివ శంకర్ మాస్టర్ కు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం అని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద పెద్ద హీరోలతో కూడా కలిసి పని చేశాడు. ఆయనకు ఇలాంటి పరిస్థితి రావడంతో ప్రముఖులు ఆయనకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నట్టు సమాచారం.