Schools : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బడి గంటలు మోగనున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కేసుల కారణంగా జనవరి 8వ తేదీ నుంచే రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులను ముందుగానే ప్రకటించారు.
అయితే కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా సంక్రాంతి అనంతరం సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ సెలవులు ఈ నెల 31వ తేదీతో ముగియనున్నాయి. అయితే సెలవులు ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం తగ్గుతున్న కారణంగా ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలను పునః ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.. విద్యార్థులు కరోనా జాగ్రత్తలను పాటించేలా చూడాలన్నారు.