Sarkaru Vaari Paata : ఓటీటీ యాప్ లు ఈమధ్య కాలంలో తెలివిమీరిపోయినట్లు కనిపిస్తోంది. కొత్త సినిమాలను చూడాలని ఎదురు చూస్తున్న ప్రేక్షకుల ఆశలను ఆ యాప్ లు అడియాశలు చేస్తున్నాయి. ఠాఠ్.. సినిమాను చూసేందుకు డబ్బులు చెల్లించాల్సిందేనని కండిషన్స్ పెడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీకి జీ5 ఇలాగే డబ్బులు చెల్లించాలని షరతు విధించింది. ప్రేక్షకుల నుంచి భారీ ఎత్తున నిరసనలు రావడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఉచితంగానే ఆర్ఆర్ఆర్‌ను చూడవచ్చని ప్రకటించింది. అయితే అమెజాన్ ప్రైమ్‌కు మాత్రం ఇంకా బల్బు వెలగనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సర్కారు వారి పాటకు కూడా ఇలాగే షరతు విధించింది.
మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమా మే12న థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పటికీ ఇంకా ఈ మూవీ థియేటర్లలో ప్రదర్శితం అవుతూనే ఉంది. అయితే దీన్ని అమెజాన్ సడెన్‌గా తన ఓటీటీలో రిలీజ్ చేసింది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ పెట్టింది. గతంలో రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 లాగే సర్కారు వారి పాట సినిమాను చూడాలన్నా ప్రేక్షకులు రూ.199 చెల్లించాల్సిందేనని కండిషన్ పెట్టింది. దీంతో మళ్లీ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ ఇప్పటికైనా తన కక్కుర్తి బుద్ధిని మానుకోవాలని ప్రేక్షకులు హితవు పలుకుతున్నారు. ఈ సినిమాకు రూ.199 పెట్టి రెంట్ చెల్లించి చూడడం అంటే.. అదేదో థియేటర్‌లోనే చూడవచ్చు కదా. ఇంత మాత్రం దానికి వందలు వందలు పెట్టి అమెజాన్ ప్రైమ్‌లో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక కేజీఎఫ్ 2కు ఇన్ని రోజులూ డబ్బులు వసూలు చేసిన అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు ఉచితంగానే చూడవచ్చని ప్రకటించింది. అలాగే ఇంకొన్ని రోజులు పోతే సర్కారు వారి పాటకు కూడా ఈ ఆఫర్ ను ఇస్తుంది. కనుక ప్రేక్షకులు రూ.199 చెల్లించకపోవడమే బెటర్. కొన్ని రోజులు ఆగితే వారే ఉచితంగా చూడండని చెబుతారు. అప్పుడు సినిమాను చూడవచ్చు. లేదంటే అమెజాన్ ప్రైమ్ ఖాతా ఉన్నా.. మళ్లీ డబ్బులు కట్టి సినిమాను చూడడం ఏమిటి ? బుద్ధి తక్కువ పని కాకపోతే..?