RRR : సాధారణంగా రాజమౌళి తన ప్రతి సినిమాని రిలీజ్ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాడు. పోస్టర్, వీడియో వంటివి బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అలాంటిది రాజమౌళి ఓ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ మూవీ డైలాగ్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
సోమవారం హైదరాబాద్‌లోని ఛాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్రికెటర్ కపిల్‌దేవ్, దర్శకుడు రాజమౌళి, వైద్యులు రవి తంగరాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘నిర్మాత శోభు యార్లగడ్డ ద్వారా ఛాయిస్ ఫౌండేషన్ సతీశ్ పరిచయం అయ్యారు. పిల్లల్లో కలిగే 90 శాతం సమస్యలకు పరిష్కారాలున్నాయి. ఛాయిస్ ఫౌండేషన్ పిల్లల కోసం ఎన్నో రోజులుగా కష్టపడుతోంది’ అని అన్నారు.
ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’లోని ఓ డైలాగ్‌ను రాజమౌళి పంచుకున్నారు. ‘‘యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. అది ధర్మ యుద్ధమైతే విజయం తథ్యం’’ అని డైలాగ్ చెప్పారు. మరి ఈ డైలాగ్ ను సినిమాలో ఎవరు ఎవరితో అన్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే! ప్రస్తుతం ఈ డైలాగ్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.
ఆర్ఆర్ఆర్ ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా, డీవీవీ దానయ్య దీనిని భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా అలాగే చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం వీరిద్దరి ఫస్ట్ లుక్ టీజర్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ అందుకున్నాయి.